
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే.
వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment