నిరీక్షణ | Expectation | Sakshi
Sakshi News home page

నిరీక్షణ

Published Mon, Aug 31 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

నిరీక్షణ

నిరీక్షణ

సాక్షి, కడప : జిల్లాలో సుమారు 1747 చౌక దుకాణాల పరిధిలో 7,32,852 కార్డులు ఉండగా.. ఆధార్ సీడింగ్ పేరుతో దాదాపు 40వేల రేషన్ కార్డుదారులను అనర్హులుగా గుర్తించి తొలగించారు. ఇందులో కొన్ని కుటుంబాలకు సంబంధించి వేరే కార్డులో పేర్లు ఉన్నాయని.. మరికొంతమంది ఇళ్లలో లేకుండా ఉన్నారని సాకు చూపి తొలగించారు. ఆధార్ సీడింగ్ చేయకమునుపు 7,32,852 రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం ఆధార్ సీడింగ్ తర్వాత 6,98,982 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 40వేల కుటుంబాల వారు ఆధార్ సీడింగ్ పేరుతో కార్డులు కోల్పోవాల్సి వచ్చింది.

 లక్ష కుటుంబాలు.. కార్డుల కోసం ఎదురుచూపు  
 జిల్లాలో సుమారు లక్ష కుటుంబాల వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. 2005-06 ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా.. కార్డులను వెంటనే అందించాలని ఆదేశించడంతో అప్పట్లో కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరయ్యేవి. ఆయన మరణానంతరం కిరణ్ కుమార్‌రెడ్డి పరిపాలనలో కూడా రచ్చబండ పేరుతో ఆర్‌ఏపీ కార్డులు రెండు సార్లు అందించారు.

అయితే ప్రస్తుతం టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా మంజూరు కాలేదు. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పొందుపరిచారు. ఇలా ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలే దాదాపు లక్ష వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురుచూపులే సరిపోతున్నాయి తప్ప  కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి.  

 ఇప్పటికి కూపన్లతోనే..
 జిల్లాలో ఇప్పటికీ కూపన్లతోనే రేషన్ తీసుకుంటూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక సారి రచ్చబండ పథకం కింద ఆర్‌ఏపీ పేరుతో కార్డులు ఇవ్వగా.. తర్వాత కార్డులు ఇవ్వకుండా టెంపరరీ కార్డుల పేరుతో కూపన్లు ఇచ్చారు. అయితే ఈ కూపన్లు ఏడాదికో.. ఆరునెలలకో తహశీల్దార్ కార్యాలయంలో తెచ్చుకొని నెలనెలా రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోంది.  
 
 4 నెలలుగా సరుకులు అందడంలేదు..
 నా పేరు పాలగిరి చంద్రమోహన్. వేంపల్లెలోని 8వ నెంబరు రేషన్ షాపు నుంచి సరుకులు తీసుకుంటున్నా. ఆధార్ కార్డు నెంబరు సరిగా ఉన్నా.. 4నెలలుగా సరుకులు  మంజూరు కాలేదు. అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. నిరుపేద కుటుంబం నాది. 4నెలలుగా రేషన్ సరుకులు రాకపోతే ఎలా బతకాలి.     
- పాలగిరి చంద్రమోహన్(గరుగు వీధి), వేంపల్లె
 
 పేదవాడి గురించి ఎవరూ పట్టించుకోలేదు..
 మూడేళ్లుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నా. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే రాలేదంటున్నారు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకోవాలి. పేద వాడి గురించి పట్టించుకొనేవారే కరువయ్యారు.
     - మమత(భజన మందిరంవీధి), పులివెందుల
 
 5ఏళ్లుగా కొత్త కార్డు కోసం ఎదురుచూస్తున్నా..  
 నా పేరు మల్లేశ్వరి.. నేను పులివెందులలోని రెడ్డి వారి వీధిలో నివాసముంటున్నా. నా భర్త జగన్ పులివెందులలోనే మెకానిక్ పనిచేస్తున్నాడు. రేషన్ కార్డు కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేస్తూనే ఉన్నా. ఐదేళ్లయినా ఇంతవరకు కార్డు రాలేదు.
     - మల్లేశ్వరి(రెడ్డివారివీధి), పులివెందుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement