రేషన్ కార్డులు
సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం) : రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సామాన్యులు రేషన్‌కార్డు పొందాలంటే గగనమైపోతుంది. కార్డు కోసం ముప్పతిప్పలు పెడుతున్నారు. జన్మభూమి సభల్లో ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా చివరకు మొండి చేయే చూపుతున్నారు. తాజాగా కొత్త రేషన్‌కార్డు కావాలంటే 1100కు ఫోన్ చేయాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. తరువాత ఒక ప్రైవేటు సంస్థ రియల్ టైం గవర్నెన్స్(ఆర్‌టీజీఎస్) సంస్థ ద్వారా వివరాలను సేకరిస్తుంది.
అవగాహన లేమి...
రేషన్ కార్డు మంజూరులో ప్రజలకు అవగాహన కల్పించకుండా కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. గతంలో మాదిరిగా తహసీల్దార్ కార్యాలయంలోను, వివిధ సభల్లోను దరఖాస్తులు చేయనవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ 1100 ద్వారా రేషన్‌కార్డును పొందే అవకాశం కల్పించారు. ఈ నెంబరు రియల్ టైం గవర్నెన్స్ (ఆర్‌టీజీఎస్) పరిధిలో ఉంటుంది.
కార్డు కావాల్సిన వారు తమ ఫోన్ నుంచి 1100లకు ఫోన్ చేయాలి. అటునుంచి అడిగిన మేరకు పేరు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు తెలియజేయాలి. ఆ తరువాత సదరు వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అధికారులు దర్యాప్తు చేసి కార్డుకు సిఫార్సు చేస్తారు. అయితే మారుతున్న టెక్నాలజీ తెలియని ప్రజలు మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు తిరుగుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలు ఇలా...
కొత్తగా తెలుపు రేషన్ కార్డు కావాలంటే ఆర్‌టీజీఎస్‌లో నమోదు కావల్సి వుంది. వారు పూర్తిగా ప్రజా సా«ధికార సర్వే వివరాలపై ఆధార్ పడి ఈ కార్డు మంజూరు చేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా ప్రజాసాధికార సర్వేలో వివరాలు లేకపోతే కార్డు మంజూరు కాదు. సర్వే ఆధారంగా వారి ఆస్తులు, ఇళ్లు, వాహనాలు, ఇతర వివరాలు ఆర్‌టీజీఎస్‌లో బహిర్గతమవుతాయి. దరఖాస్తు దారునికి 500 గజాలు మించి ఇళ్లు, ఐదు ఎకరాల పొలం, నాలుగు చక్రాల వాహనం వంటివి నమోదై ఉంటే తెలుపు రేషన్ కార్డు మంజూరు కాదు.
ఏ కార్డులో పేరు నమోదై ఉండకూడదు
రేషన్ కార్డు కోసం చేసుకొన్న దరఖాస్తుదారు ఏ ఒక్క కార్డులో నమోదై ఉండకూడదు. ఏ కార్డులో కూడా నమోదు కానివారు కొత్త కార్డు కోసం 1100 ద్వారా చేయాలి. అలాగే ప్రజాసాధికార సర్వేలో వారి తల్లిదండ్రులతో కలిసి నమోదై ఉండకూడదు. ఒక వేళ ఉంటే, వారు సంబంధిత తహసీల్దార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా సా«ధికార సర్వేలో స్పిల్టింగ్ (వేరుగా ఉన్నట్లు) చేసుకోవాలి. అప్పుడే కొత్త కార్డు పొందేందుకు అర్హులవుతారు.
అవగాహన కల్పిస్తున్నాం...
కొత్తగా రేషన్‌కార్డు కావాలనే వారికి గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నాం. వీఆర్‌ఓల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. కార్డు కావాలనే వారు తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వే చేయించుకోవాలి. ఏ కార్డులో నమోదు కాని వారు మాత్రమే 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోను చేయాలి.
– పి.సోమేశ్వరరావు, తహసీల్దార్, గరుగుబిల్లి
Comments
Please login to add a commentAdd a comment