రెండో దశలోనూ దోపిడీ | Exploitation also in the second stage of Fiber Grid Tender | Sakshi
Sakshi News home page

రెండో దశలోనూ దోపిడీ

Published Sun, Dec 30 2018 4:00 AM | Last Updated on Sun, Dec 30 2018 4:52 AM

Exploitation also in the second stage of Fiber Grid Tender - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కాజేసేందుకు ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కల్పతరువులా మారిపోయింది. తొలిదశ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును రూ.300 కోట్లతో ప్రారంభించి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్ధకు కట్టబెట్టడం తెలిసిందే. తొలిదశ ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.4,000 కోట్లకు పెంచేసి అందులో సగం నిధులను ‘ముఖ్య’ నేత తన బినామీ ద్వారా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా రెండో దశలో ఫైబర్‌ ఆప్టికల్‌ లైన్‌ దూరం పెరిగిందంటూ ప్రాజెక్టు వ్యయాన్ని రెట్టింపు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

జిల్లాల వారీగా పందేరం.. 
రెండోదశ ఫైబర్‌ నెట్‌కు కేంద్ర ప్రభుత్వం భారత్‌ నెట్‌ రెండో దశ పేరుతో నిధులను కేటాయించింది. రెండో దశ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును కూడా ప్రభుత్వ పెద్దలు వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాప్ట్‌వేర్‌తోపాటు రాజధానిలో భారీగా ప్రాజెక్టులు చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థకు టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌ను కూడా తమ దారికి తెచ్చుకుని టెండర్‌ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎల్‌–2, ఎల్‌–4గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ, టెరా సాప్ట్‌వేర్‌తో బేరసారాలు సాగించి రెండోదశ ఫైబర్‌ నెట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్, ఎల్‌ అండ్‌ టీ, టెరా సాప్ట్‌వేర్‌ సంస్థలకు జిల్లాలవారీగా పంచేశారు. టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌కు ఐదు జిల్లాలను, ఎల్‌ అండ్‌ టీకి నాలుగు జిల్లాలను, టెరా సాప్ట్‌వేర్‌కు నాలుగు జిల్లాలను పంచేస్తూ ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. 
గ్రామ పంచాయతీలన్నింటికీ ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌ నెట్‌ రెందో దశ కింద రూ. 851.23 కోట్లు కేటాయించింది. తొలుత నిర్వహించిన టెండర్లలో ‘ముఖ్య’ నేత సన్నిహితుడికి చెందిన సంస్థ అర్హత సాధించలేదు. మరో రెండుసార్లు టెండర్ల నిబంధనలనలకు సవరణలను ప్రతిపాదించినా అర్హత సాధించకపోవడంతో వాటిని రద్దుచేసి సింగిల్‌ ప్యాకేజీ, మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. రెండోసారి టెండర్‌లో టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌ ఎల్‌–1గా నిలిచింది. ఎల్‌–2గా ఎల్‌ అండ్‌ టీ, ఎల్‌–4గా టెరా సాఫ్ట్‌వేర్‌ నిలిచాయి. అయితే ఎల్‌–1గా నిలిచిన టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం కన్నా 9.1 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ కోట్‌ చేసింది. ఆ తరువాత అంతకన్నా ఎక్కువగా ఎల్‌ అండ్‌ టీ, టెరాసాఫ్ట్‌ వేర్‌ సంస్థలు టెండర్‌ కోట్‌ చేశాయి.  నిబంధనల మేరకు అంచనా వ్యయం కన్నా ఐదు శాతం ఎక్సెస్‌ కోట్‌  చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2004 నవంబర్‌ 20వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెండర్‌ నిబంధనలకు మించి ఎక్కువగా కోట్‌ చేసినందున ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. జీవో 133కి  విరుద్ధంగా ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు కోట్‌ చేసినందున ఆ టెండర్‌ను రద్దు చేసి కొత్తగా ఆహ్వానించాలని ఇంధన, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి కూడా స్పష్టం చేశారు. 
 
కంచే చేను మేసింది.. 
ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ సంస్థపై ‘ముఖ్య’ నేత ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర స్థాయి అమలు కమిటీ ఎల్‌–1గా నిలిచిన టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌ కోట్‌ చేసిన ధరకు ఎల్‌–2గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీని, ఎల్‌–4గా నిలిచిన టెరా సాఫ్ట్‌ వేర్‌ను ముందుకు రావాలని కోరింది. ఇందుకు ఆ రెండు సంస్థలు అంగీకరించడంతో రూ.787.86 కోట్ల  విలువైన పనులను టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌ కోట్‌ చేసిన రూ.859.87 కోట్లకు 9.1 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ను ఖరారు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును మూడు విభాగాలుగా విభజించింది. ఐదు జిల్లాల్లో పనులను టెలి కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌కు, నాలుగు జిల్లాల్లో ఎల్‌ అండ్‌ టీకి, మరో నాలుగు జిల్లాల్లో టెరా సాప్ట్‌వేర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు.  

వ్యయం రెట్టింపు.... 
భారత్‌ నెట్‌ రెండోదశ వ్యయాన్ని రూ.851.23 కోట్ల నుంచి రూ.1,410.01 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు చెబుతున్న కారణాలను గమనిస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. భారత్‌ నెట్‌ రెండోదశ ప్రాజెక్టు వ్యయం రూ.851.23 కోట్లుగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలన్నింటికీ 51,449 కిలోమీటర్ల మేర ఫైబర్‌ ఆప్టికల్‌ లైన్‌ వేయాల్సి ఉందని, అయితే ఇప్పుడు దూరం 55,000 కి.మీ.కి పెరగడంతో ప్రాజెక్టు వ్యయం రూ.1,410.01 కోట్లకు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం 3,551 కిలోమీటర్లు మాత్రమే దూరం పెరిగితే ప్రాజెక్టు వ్యయం దాదాపు రెట్టింపు కావడాన్ని చూస్తుంటే ఇందులో దోపిడీకి స్కెచ్‌ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

సెట్‌టాప్‌ బాక్సుల పేరుతో అప్పు చేసి... 
ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ తొలిదశ ప్రాజెక్టును టెరా సాప్ట్‌వేర్‌కు ఏకపక్షంగా కట్టపెట్టారు. తొలుత ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ పేరుతో ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లను కరెంట్‌ స్తంభాల ద్వారా వేసేందుకు రూ. 300 కోట్లతో ప్రాజెక్టును టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అప్పగించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు సెట్‌టాప్‌ బాక్సులు పంపిణీ చేయాలంటూ అది కూడా టెరా సాప్ట్‌వేర్‌కే అప్పగించేశారు. రాష్ట్రంలోని 95 శాతం ఇళ్లలో టీవీలకు ఇప్పటికే సెట్‌టాప్‌ బాక్సులున్నా ఫైబర్‌ గ్రిడ్‌ పేరుతో ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా ప్రతి ఇంటికీ కొత్తగా సెట్‌టాప్‌ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సెట్‌టాప్‌ బాక్సు ధరను ఏకంగా రూ.4 వేలుగా నిర్ణయించింది. బయట మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సు ఒక్కోటి రూ.1,200 – రూ.1,500కే దొరుకుతున్నాయి. బాగా నాణ్యమైనదనుకున్నా వీటి ఖరీదు రూ.2 వేలకు మించి ఉండదు. వీటిని రూ.4 వేల చొప్పున విక్రయించడం ద్వారా సగం డబ్బులు దోచేస్తున్నట్లు తేలిపోతోంది. ఇలా కోటి సెట్‌టాప్‌ బాక్సులను విక్రయించడం ద్వారా రూ.2,000 కోట్లు దోచేసినట్లు అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పది లక్షల సెట్‌టాప్‌ బాక్సులను కొనుగోలు చేసేందుకు ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు గతంలో రెండు విడతలుగా రూ.711 కోట్ల మేర అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. దీనికితోడు సెప్టెంబర్‌లో ఏకంగా కోటి సెట్‌టాప్‌బాక్సుల కొనుగోలు కోసం రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జీవో 27 జారీ చేసింది. 
 
కేంద్రం భరించేది రూ.900 కోట్లే
రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో సాధ్యమైనంత త్వరగా ఇంటర్నెట్‌ సదుపాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునీఠ ఆదేశించారు. ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌ రెండో దశపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. భారత్‌ నెట్‌ రెండో దశ కింద 11,400కిపైగా పంచాయతీల్లో పూర్తిస్థాయి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు రూ.1,480 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇస్తుండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని రాష్ట్ర ఫైబర్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ ఎండీ దినేశ్‌కుమార్‌ ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోగా పంచాయితీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement