
బతికాం!
: ‘‘తీసుకెళ్లిన ఆహార పదార్థాలు ఆరు రోజులకే అయిపోయాయి.. రెండు రోజులకోసారి గాలం ద్వారా చేపలు పట్టి, వాటినే కాల్చుకుని తిన్నాం..
చేపలు తిని.. నీళ్లు తాగి..
స్వస్థలానికి చేరిన మత్స్యకారుల వెల్లడి
20 రోజుల అనంతరం గిలకలదిండికి
కుటుంబసభ్యులు, గ్రామస్తుల్లో ఆనందం
మచిలీపట్నం : ‘‘తీసుకెళ్లిన ఆహార పదార్థాలు ఆరు రోజులకే అయిపోయాయి.. రెండు రోజులకోసారి గాలం ద్వారా చేపలు పట్టి, వాటినే కాల్చుకుని తిన్నాం.. బోటులో ఉన్న ఐస్‌ని కరగబెట్టి, ఆ నీటిని తాగాం.. అలా ప్రాణాలు కాపాడుకున్నాం..’’ ఇదీ గల్లంతై సోమవారం తిరిగి గిలకలదిండికి చేరుకున్న మత్స్యకారులు సైకం నాగూర్, తిరుమాని నాగరాజు చెప్పిన మాటలు. సోమవారం ఉదయం విజయవాడ రైల్వేస్టేషన్‌కు ఆరుగురు మత్స్యకారులు తమ స్వస్థలాలకు వెళ్లారు. వారిలో గిలకలదిండికి చెందిన నాగూర్, నాగరాజు తమ ఇళ్లకు చేరారు. ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. తాము చేపల వేటకు వెళ్లిన మూడో రోజునే బోటు చెడిపోయిందని, సముద్రంలో భయంకరమైన అలల తాకిడికి బోటు కొట్టుకుపోయిన దిశ కూడా తెలియలేదని చెప్పారు. దీంతో జాయింటు బోటుకు కబురుపెట్టామని, అది గత నెల 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ బోటు సమీపానికి వచ్చిందని తెలిపారు. ఈలోగా అలల ఉధృతి మరింతగా పెరడంతో జాయింట్ బోటు దూరంగా వెళ్లిపోయిందని చెప్పారు. ఆ రాత్రి బోటు ఎటు వెళుతోందో, గాలులు, అలల తీవ్రతకు ఏ దిక్కుకు వెళుతున్నామో తెలియలేదన్నారు. జీపీఎస్ సిస్టమ్ ఆగిపోయిందని, వైర్‌లెస్ సెట్లు పనిచేయకుండా పోయాయని చెప్పారు. సమీపానికి ఏదైనా ఓడ వస్తే జెండా ఊపినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ నెల రెండోతేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నేవీకి చెందిన చిన్న విమానం తమను గుర్తించిందని, మూడో తేదీన తమ వద్దకు వారు ఓడను పంపారని వివరించారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరటంతో ప్రాణం లేచొచ్చిందని తెలిపారు. అధికారులు చొరవ తీసుకోవటంతో ప్రాణాలతో బయటపడ్డామని వివరించారు.
మొక్కుబడులు చెల్లించుకుని ఇంటికి
గ్రామానికి చేరుకున్న నాగరాజు, నాగూర్‌లు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలకు తిరిగి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర వీరిని వెంట పెట్టుకుని సోమవారం గిలకలదిండికి తీసుకువచ్చారు. గ్రామస్తులు వీరికి ఎదురేగి వెళ్లి అన్ని ఆలయాల్లో పూజలు చేయించారు. నాగూర్ భార్య మేనక, కుమార్తె లక్ష్మీదుర్గ, నాగరాజు భార్య సరస్వతి, కుమారుడు నెహెమ్యా, కుమార్తె ప్రిస్కిల్లాతో పాటు పలువురు గ్రామస్తులు గల్లంతైన వారు తిరిగి రావటంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మత్స్యశాఖ డెప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను గుర్తించిన సమాచారం అందుకున్న వెంటనే తాము అక్కడికి బయలుదేరి వెళ్లామని, అక్కడినుంచి ఐదో తేదీన బయల్దేరి ఇక్కడికి చేరుకున్నామని చెప్పారు.