భూసమీకరణ గడువు పొడిగింపు చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని భూసమీకరణకు గడువు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టానికి విరుద్ధమని రైతుసంఘాలు ధ్వజమెత్తాయి. రైతుల అభ్యర్థన మేరకు నోటిఫికేషన్ గడువును పెంచుతున్నామని సీఆర్‌డీఏ అధికారి చెప్పడాన్ని తప్పుపట్టాయి. భూములిచ్చేందుకు రైతులే అనాసక్తి చూపుతున్న తరుణంలో మళ్లీ గడువు పెంచి ఎవర్ని బెదిరిస్తారని ప్రశ్నించాయి.
‘‘సీఆర్‌డీఏ చట్టంలోని 9వ అధ్యాయం ల్యాండ్ పూలింగ్ అంశానికి చెంది నది. అందులోని 55వ సెక్షన్‌లోని 4, 5, 6 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం నిర్ణీత గడువులోనే భూసమీకరణ పూర్తి కావాలి. అదీ రైతుల ఇష్టపూర్వకంగానే జరగాలి. సెక్షన్ 56, 2వ నిబంధన ప్రకారం భూ సమీకరణకు అత్యధికంగా ఇచ్చిన గడువు 30 రోజులు. ల్యాండ్ పూలింగ్ పథకం నోటిఫికేషన్ నిబంధనలూ ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయి. భూసమీకరణకు ప్రభుత్వం జనవరి 2 నుంచి 14 వరకు సమయానుకూలంగా ఆయా గ్రామాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటి ప్రకారం ఈ నెల 14తో గడువు ముగిసింది. తుది నోటిఫికేషన్ ఆధారంగా భూములిచ్చినా కూడా సీఆర్‌డీఏ అధికారులు మాత్రం పాత తేదీలతో అంటే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 2 లోపు ఇచ్చినట్టే రికార్డుల్లో రాస్తున్నారు. ఇంతచేసినా అనుకున్న మేర భూ సమీకరణ జరగక నోటిఫికేషన్ గడువును పొడిగించారు.
ఇది సీఆర్‌డీఏ చట్టానికి, ల్యాండ్‌పూ లింగ్ నిబంధనలకు వ్యతిరేకం. ఒకవేళ పొడిగించాలనుకుంటే చట్టాన్ని మార్చాలి. లేదంటే ఆర్డినెన్స్ తీసుకురావాలి. ల్యాండ్ పూలింగ్ స్కీంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే విషయాన్ని చెప్పింది’’ అని రైతు సంఘాలు పేర్కొన్నాయి. దీనిపై రైతు సమాఖ్య నేత ఎం.శేషగిరిరావు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ గడువు పొడిగింపుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గడువు పొడిగింపు అన్యాయం, చట్టవిరుద్ధమని ఏపీ రైతు సంఘం నేత కేవీవీ ప్రసాదరావు పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారమే భూమిని సేకరించాలని మరో రైతు నాయకుడు వి.సుబ్బారావు డిమాండ్ చేశారు.