ఫ్యాక్షన్ గ్రామాల్లో ముందు జాగ్రత్తలు
నరసరావుపేట టౌన్
గ్రామాల్లో చోటుచేసుకుంటున్న ఫ్యాక్షన్ గొడవలు పునరావృతం కాకుండా ముందస్తుచర్యలు తీసుకోవాలని రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట పోలీస్ డివిజన్‌లోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో గొడవలకు పాల్పడేవారు, గొడవలకు ఉసిగొల్పే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డివిజన్‌లో ముఠాతగాదాలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాని చెప్పారు. సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కేసుల విషయంలో అధికారులు పాటించాల్సిన, తీసుకోవాల్సిన అంశాలపై పలుసూచనలు చేశారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటయ్య, సీఐలు ఎం.వి. సుబ్బారావు, బి.కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సంజీవ్‌కుమార్, చెంచుబాబు, శ్రీకాంత్‌బాబు, మల్లయ్య, ఎస్‌ఐలు లోక్‌నాథ్, రమేష్, సాంబశివరావు, కట్టా ఆనంద్, సురేష్‌బాబు, జగదీష్‌లతోపాటు డివిజన్‌లోని మిగిలిన స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేరగాళ్లపై ఉక్కుపాదం
పిడుగురాళ్ల:హత్యలు, దాడులు, ఇతర నేరాలకు పాల్పడేవారు ఎంతటివారైనా సహించేంది లేదని రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు, దాడుల సంఘటనల నేపథ్యంలో శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ఓఎస్‌డీ కార్యాలయంలో సత్తెనపల్లి, గురజాల పోలీస్‌డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సమావేశం నిర్వహించి సమీక్షంచారు. అనంతరం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణ ఎన్నికల తర్వాత పల్నాడు ప్రాంతంలో జరిగిన హత్యలు, దాడుల ఘటనలు కేవలం చిన్నచిన్న భూవివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్నాయన్నారు. ఇటీవల బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో జరిగిన హత్య మాత్రమే కొంతమేర రాజకీయహత్యగా భావించాల్సి వస్తుందన్నారు. చిన్న చిన్న వివాదాలు ఘర్షణలు నివారించేందుకు త్వరలోనే ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ, పోలీసు, లీగల్‌సెల్ అథారిటీ, పట్టణాల్లో మున్సిపల్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి రెండువైపుల వారికీ నచ్చజెప్పి రాజీ చేయడం, ఒకవేళ రాజీ పడని పక్షంలో వెంటనే బైండోవర్ లేదా ఇతరత్రా కేసులు పెట్టేవిధంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో శాంతి కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. కారంపూడి మండలం చినగార్లపాడులో జరిగిన హత్య కేసుతోపాటు ఇతర కేసుల్లో నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. సమావేశంలో సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు వెంకటేశ్వరనాయక్, ఇంజారపు పూజ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల సీఐలు యు.శోభన్‌బాబు, వై.శ్రీధర్‌రెడ్డి, ఇతర సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.