లింగంపేట్ మండలంలో వెలుగు చూసిన నకిలీ పహాణీల వ్యవహా రంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, నిజామాబాద్ :
లింగంపేట్ మండలంలో వెలుగు చూసిన నకిలీ పహాణీల వ్యవహా రంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు వీఆర్‌ఓ కృష్ణారెడ్డి గదిని సోదా చేసి, సుమారు వందకుపైగా పట్టాదారు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల హస్తం లేనిదే ఓ వీఆర్‌ఓ వద్ద ఇన్ని పాసుపుస్తకాలు(కొత్తవి) ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పాసుపుస్తకాలను ఆర్మూ ర్ మండలంలోని పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ముద్రిస్తారు. ఆర్డీఓ కార్యాలయాల నుంచి వచ్చిన ఇండెంట్ మేరకు వాటిని ఆర్డీఓ కార్యాలయాలకు పంపుతారు. ఇలా ఆరు నెలల క్రితం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌కు 10 వేలు, బోధన్, కామారెడ్డి డివిజన్లకు ఐదు వేల చొప్పున పాసుపుస్తకాలను కేటాయించారు.
కామారెడ్డి డివిజన్‌లోని పది మండలాల పరిధిలో సుమారు 250కిపైగా గ్రామాలున్నా యి. సగటున ఒక్కో గ్రామానికి 20కి మించి పాసుపుస్తకాలు అందే అవకాశాలు లేవు. కానీ ఒక్క లింగంపే ట్ వీఆర్‌ఓ వద్దే సుమారు వందకు పైగా పాసుపుస్తకాలు లభించడం అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారు ల ప్రమేయం ఉండిఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ పహాణీల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే వీఆర్‌ఓ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ మహేశ్‌గౌడ్‌లపై కేసులు నమోదు చేశారు. మహేశ్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. కృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. లోతుగా విచారణ జరిపితే ఉన్నతాధికారుల ప్రమే యం బయటపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే కింది స్థాయి సిబ్బందిని బలిచేసి, ఈ అక్రమాలనుంచి బయటపడేందుకు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది.
సొసైటీలకు లక్షల్లో కుచ్చుటోపి..
నకిలీ పాసుపుస్తకాలు, బోగస్ పహాణీలతో అక్రమార్కులు సహకార సంఘాలకు లక్షల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. బోగస్ పహాణీ లు, నకిలీ పాసుపుస్తకాలతో ఎకరాలకు ఎకరాలు ఉన్నట్లు చూపి సొసైటీల నుంచి లక్షల రూపాయల్లో దీర్ఘకాలిక రుణాలు పొందినట్లు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు, ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు సైతం లింగంపేట్, నల్లమడుగు, శెట్పల్లి పీఏసీఎస్‌లలో ఇలా రుణాలు తీసుకున్నట్లు తెలిసింది.