మోర్తాడ్, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వస్తున్న గ్రామ సేవకులు, రెవెన్యూ అధికారులను వ్యాపారులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఇసుక వ్యాపారం మాఫియాను తలపిం చేదిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్దవాగులో ఇసుక నిలువలు పెరిగినప్పటికీ ఇసుక రవాణాకు పాయింట్‌లను అధికారులు గుర్తించలేదు. గ్రామాలలో ఇళ్ల నిర్మాణం, వ్యాపార సముదాయాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుకకు డిమాండ్ ఏర్పడటంతో అక్రమ రవాణాకు వ్యాపారులు బరి తెగిం చారు.
ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిలో ఇసుకకు అధికంగా ధర ఉండటంతో ఈ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. మండలంలోని సుంకెట్, తొర్తి శివారుల్లోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అక్రమ రవాణాను నిలువరించడానికి రెవెన్యూ అధికారులు గ్రామ సేవకులు, గ్రామ రెవెన్యూ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పూట కాపలా ఉంచుతున్నారు. కేవలం కింది స్థాయి ఉద్యోగులు కాపలా కాస్తుండటంతో వ్యాపారులు వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు చేసేది లేక ఇసుక రవాణా చేసే వాహనాలను అడ్డుకునేందుకు జంకుతున్నారు. రెండు ప్రాం తాల నుంచి దాదాపు ఆరు వాహనాల్లో ఇసుకను వ్యాపారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ ముగించుకుని వెళ్లిన తరువాత ఇసుక వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. పోలీసుల పెట్రోలింగ్ పూర్తి కాగానే రెవెన్యూ సిబ్బంది నోళ్లను ఇసుక వ్యాపారులు మూయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాపలా కాస్తున్న గ్రామ సేవకులు, గ్రామ రెవెన్యూ అధికారులను అంతు చూస్తామని వ్యాపారులు బెదిరిస్తుండటంతో వారు తమ వేదనను ఎవరికి చెప్పలేక పోతున్నారు.
కొందరు గ్రామ సేవకులు, రెవెన్యూ అధికారులు ఇసుక రవాణా నిలువరించడానికి కాప లా ఉండబోమని మండల తహశీల్దార్‌కు స్పష్టం చేశారు. ఇసుక వ్యాపారుల ఆగడాలను ఎలా అరికట్టాలో అర్థం కాక రెవెన్యూ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఇసుక రవాణా చేసే వారిని గుర్తించి వ్యాపారులపై పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. అంతేకాక ఇసుక రవాణా చేసే వాహనాలను సీజ్ చేసి కోర్టుకు స్వాధీనపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇసుక రవాణా చేసే వారి పట్ల అధికారులు సీరియస్‌గా వ్యవహరించక పోవడంతోనే వ్యాపారులు పెట్రేగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక వ్యాపారం మాఫియాను తలపిస్తుందని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. కాని ఇసుక అక్రమ రవాణా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించక పోవడంతో వ్యాపారులు బహిరంగంగానే కాపలా కాస్తున్న రెవెన్యూ ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు సంయుక్తంగా కాపలా కాస్తే ఇసుక రవాణాను నిలువరించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పేరిట అక్రమ వసూళ్లు
ఇసుక అక్రమ రవాణాకు తోడు రెవెన్యూ అధికారుల పేరిట అక్రమ వసూళ్ల దందా జోరుగా సాగుతుంది. తొర్తిలో రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇవ్వాలంటూ రూ. లక్ష వసూలు చేసిన ఒక వ్యాపారి అధికారులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నాడు. వ్యాపారుల మధ్య వివాదం తలెత్తడంతో అధికారుల పేరిట అక్రమ వసూళ్ల వ్యవహారం బయటపడింది. అధికారులు విచారణ జరిపితే అక్రమ రవాణా, అక్రమ వసూళ్ల వ్యవహారం బయటపడి దోషులు ఎవరు అనే తేలే అవకాశం ఉంది.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
-అనిల్ కుమార్, తహశీల్దార్, మోర్తాడ్
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారిని నిలువరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఇసుక అక్రమంగా రవాణా చేయడం నేరం. దీనికి తోడు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇసుక వ్యాపారుల నుంచి ఎవరు ముడుపులు తీసుకున్నా కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు సహకరిస్తే ఇసుక అక్రమ రవాణాను నిలువరించవచ్చు.
ఇసుక మాఫియా బెదిరింపులు
Published Wed, Oct 16 2013 7:32 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement