ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతంలో రెవెన్యూ, పోలీసులు అధికారులు
ఇచ్ఛాపురం రూరల్: ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. రెండు రోజుల క్రితం కొళిగాం–అరకబద్ర బాహుదా నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు.. ఈదుపురం బాహుదానదిలో ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మరుగుదొడ్లు నిర్మాణాల కోసమని 15 రోజుల నుంచి ఇసుకాసురులు రెచ్చిపోయారు. బాహుదా నది పరివాహక ప్రాంతమైన కొళిగాం, అరకబద్ర, ఈదుపురం, బిర్లంగి, బొడ్డబడ పరివాహక ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు అధికార పార్టీ నేతలు చేయి కలపడంతో ఇసుకాసురులు మరింత రెచ్చిపోతున్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ మామిడిపల్లి సురేష్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎఎస్సై ఎస్.జీవన్‌కుమార్ సహకారంతో డిప్యూటీ తహసీల్దార్ కొర్నాణ మురళీకృష్ణ, ఆర్‌ఐ కృష్ణప్రసాద్ రౌళో, వీఆర్‌ఓలు వసంతరాజు, సీతారామయ్య, చిరంజీవి సాహు దాడులు నిర్వహించారు. 13 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. 11 ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తహసీల్దార్ సురేష్ తెలిపారు.
సంఘటన స్థలంలోనే నేతల ట్రాక్టర్లు
రెవెన్యూ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన పెద్దల నుంచి ఒత్తిడి మొదలైంది. మండలంలో కీలక పదవులను నిర్వహిస్తున్న ఇద్దరు నేతల ట్రాక్టర్లు అందులో ఉన్నాయి. అధికారులు తమ ట్రాక్టర్లు పట్టుకున్నట్లు తెలుసుకున్న ఆ నేతలు సంఘటన స్థలంలో ట్రాక్టర్లను వదిలి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడంతో.. డ్రైవర్లు వాటిని అమలు పరిచారు. 11 ట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నప్పటికీ టీడీపీకి చెందిన కీలక నేతలు «ట్రాక్టర్లు సంఘటనా స్థలంలోనే ఉండటంతో.. ఆయా ట్రాక్టర్ల యజమానులు అధికారుల తీరుపై మండిపడ్డారు. అందరికీ ఒకేలా న్యాయం చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో గురువారం వాటిని అదుపులోకి తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment