వర్ష బీభత్సానికి నష్టపోయినవారిని ఆదుకునే వారు కరువయ్యారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతనెలలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. అధికార యంత్రాంగం రెండు, మూడు రోజులు సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది.
సాక్షి, నిజామాబాద్ : వర్ష బీభత్సానికి నష్టపోయినవారిని ఆదుకునే వారు కరువయ్యారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గతనెలలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. అధికార యంత్రాంగం రెండు, మూడు రోజులు సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. వర్షాల కారణంగా జిల్లాలో 73 వేల హెక్టార్లలో వరి, మొ క్కజొన్న, సోయా, మినుము, పెసర, పత్తి పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. సుమారు 1,100 ఎకరాల్లో కూరగాయలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. అయితే ఈ లెక్కలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నష్టంపై రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు చేపట్టిన సర్వే నత్తనడకన సాగుతుండడంతో ‘సర్వే పూర్తయ్యేదెప్పుడు, అధికారులు ప్రతిపాదనలు పంపేదెప్పుడు, ప్రభుత్వం పరిహారం ఇచ్చేది ఎప్పుడు’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
‘వడగండ్ల’ పరిహారమే రాలేదు..
ఫిబ్రవరి, మార్చిలలో వడగండ్ల వర్షాలు కురిసి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నష్టానికే ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించలేదు. గతనెలలో కురిసి న వర్షాలతో పంట నష్టపోయిన వారికి పరి హారం రావాలంటే ఎన్ని నెలలు వేచి చూడా లో తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు ఖర్చులు పెరగడం తో కాడి కింద పడేయాల్సిన పరిస్థితులున్నాయని, ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని
పేర్కొంటున్నారు.
‘పశు’ నష్టంపై స్పందన కరువు
వర్షాల కారణంగా జిల్లాలో 70 పశువులు చనిపోయాయని పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. బాధిత రైతులకు పరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో జిల్లాలోని చాలా చెరువులు దెబ్బతిన్నాయి. 98 చెరువులకు నష్టం వాటిల్లిందని నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వీటికి తాత్కాలిక మరమ్మతులకోసం* 1.70 కోట్లు అవసరమని అంచనావేశారు.
‘ఇంటి’కి నామమాత్రమే..
వర్షాలతో జిల్లాలో 3,897 గృహాలు దెబ్బతిన్నాయని రెవెన్యూశాఖ గుర్తించింది. పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు * 15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి * 3 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఇది ఏమూలకూ సరిపోదని బాధితులంటున్నారు.