సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2014 ఖరీఫ్ సీజన్‌కు కార్యాచరణను రూపొందించారు. 3,20,761 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు వేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా వరి, సోయా సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పసుపు, చెరుకును పండిస్తారు.
ఈ నేపథ్యంలో 3.21 లక్షల హెక్టా ర్లకుగాను 12,4625 హెక్టార్లలో వరి, 70910 హెక్టార్లలో సోయా, 57,630 హెక్టార్లలో మొక్కజొన్న, 11508 హెక్టార్లలో పసుపు వేయనుండగా.. మిగతా హెక్టార్లలో కందులు, పెసర, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఏపీ సీడ్స్, హాకా, ఏపీ అయిల్‌ఫెడ్ ద్వారా 70 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 3,650 క్వింటాళ్ల మొక్కజొన్నలతోపాటు మొత్తం 79,800 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందుకోసం 2,42,685 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న వ్యవసాయశాఖ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అందుకు భిన్నంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగును కొనసాగించలేక, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లలేక రైతులు అయోమయంలో ఉన్నారు.
తగ్గిన వర్షపాతం.. ప్రాజెక్టులపైనే భారం
గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చితే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి, సోయా తదితర పంటలకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలనుకున్నా ప్రాజెక్టులపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆశాజనకంగానే ఉన్నా ఆయకట్టు రైతులు భవిష్యత్ పరిణామాలకు భయపడుతు న్నారు.
సాధారణ వర్షపాతం జిల్లాలో 849 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 233.6 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉంది. 2012లో ఇదే సీజన్‌లో 178.70 మి.మీటర్లు, 2013 సంవత్సరంలో 301.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 91.80 మి.మీ. నమోదైంది. 59 శాతం వర్షపాతం మైనస్‌గా ఉం డటం రైతులకుఆందోళన కలిగిస్తోంది. ఇదిలా వుంటే శ్రీరాంసాగర్‌లో 1091 ఫీట్లకు 1067.60 ఫీట్ల వరకు నీరు ఉన్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. నిజాంసాగర్‌లో1405 ఫీట్లకు 1392.78 ఫీట్లుగా నమోదు కాగా.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాజెక్టుల నీరు ఏ మేరకు వినియోగం అవుతుందన్న చర్చ జరుగుతోంది.
మేఘమా మురిపించకే
Published Thu, Jul 17 2014 3:09 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement