పసుపుకుప్పపై ప్రాణం పోయింది | Farmer death because of falling price to turmeric | Sakshi
Sakshi News home page

పసుపుకుప్పపై ప్రాణం పోయింది

Published Thu, May 4 2017 1:19 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

పసుపుకుప్పపై ప్రాణం పోయింది - Sakshi

పసుపుకుప్పపై ప్రాణం పోయింది

ధర పడిపోవడంతో రైతు తీవ్ర మనోవేదన
- గుండెపోటుకు గురై కన్నుమూత
- నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో ఘటన
- కొనుగోళ్లు నిలిపేయాలని రైతుల ఆందోళన..
- హమాలీకి గాయాలు.. పలువురిపై కేసు నమోదు


సాక్షి, నిజామాబాద్‌/సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌ అర్బన్‌): పసుపునకు ధర పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావన్న వేదనతో ఓ రైతు గుండె ఆగింది. నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పసుపు అమ్మకానికి తెచ్చిన రైతు దాసరి చిన్న గంగారాం(65) అదే పసుపుకుప్పపై పడి మృత్యువాత పడిన ఘటన బుధవారం వేకువ జామున జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండికి చెందిన దాసరి చిన్న గంగారాం తన పెద్దకుమారుడైన పెద్ద రాజన్నకు చెందిన 15 బస్తాల పసుపును విక్రయించేందుకు మంగళవారం నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వచ్చారు.

పంటను పరిశీలించిన వ్యాపారులు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో క్విం టాలుకు రూ.3,881 ధర నిర్ణయిం చారు. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రాలేదనే నిరాశతో రాత్రి భోజనం కూడా చేయకుండానే పడుకున్నాడని తోటి రైతులు పేర్కొన్నారు. రాత్రంతా మధనపడిన చిన్న గంగా రాం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తాను తెచ్చిన పసుపు కుప్ప వద్దకు వచ్చి నిద్రపోయాడు. నిద్రలోనే సుమారు 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి పసుపు రాశిపై కుప్పకూలాడు. ఉదయం 6 గంటలైనా నిద్రలేవకపోవడంతో సహచర రైతులు లేపేందుకు ప్రయత్నించగా, చనిపోయి ఉన్నాడు. తోటి రైతులు వెంటనే కుటుంబసభ్యులు, మార్కెట్‌ అధికారులు, పోలీసులకు సమాచార మిచ్చా రు. పోలీసులు వచ్చి రైతు మృతికిగల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

రైతుల ఆందోళన
పసుపు రైతు దాసరి చిన్న గంగారాం మార్కెట్‌ యార్డులోనే మృతి చెందడంతో పసుపు రైతు లుS ఆందోళనకు దిగారు. కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వసం చేశారు. యార్డులోని కమీషన్‌ ఏజెంట్లు, ఖరీదుదారుల దుకాణాలను మూసేయించారు. యార్డులో కొనుగోళ్లను నిలిపేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పసుపునకు కనీస మద్దతు ధర రూ.పదివేలు నిర్ణయిం చాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ వచ్చేంతవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని డిమాండ్‌ చేశారు. తక్కువ ధర వచ్చిందనే బెంగతో రైతు మృతి చెందినా కనీసం కమీషన్‌ ఏజెంట్, మార్కెట్‌ అధికారులు సంఘటనాస్థలానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని రైతులు పేర్కొంటున్నారు. రైతులు ఒకవైపు యార్డులోని క్షేత్ర కార్యాలయం (ఫీల్డ్‌ ఆఫీస్‌) ముందు ఆందోళన చేస్తున్న తరుణంలో పోలీసులు చిన్న గంగారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. రైతుల ఆందోళన సందర్భంగా యార్డులో పని చేస్తున్న హమాలీ నర్సయ్యకు గాయాలయ్యాయి. దీన్ని నిరసిస్తూ హమాలీలు యార్డులో పనులు నిలిపేశారు. ఈ ఘటనపై పలువురిపై మూడో టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్లు తిరిగి ప్రారంభించాలని మార్కెటింగ్‌ అధికారులు, కమీషన్‌ ఏజెంట్లు హమాలీలతో చర్చలు జరిపారు.

మంత్రి హరీశ్‌రావు ఆరా..

నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో బుధవారం జరి గిన ఘటనపై రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరా తీశారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పూర్తి వివరాలతో మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మార్కెట్‌యార్డులో మరణించిన రైతులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపామని మార్కెట్‌యార్డు కార్యదర్శి సంగయ్య తెలిపారు.

రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా: ఎంపీ కవిత
సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ మార్కెట్‌యార్డులో పసుపు రైతు మృతి చెందిన ఘటనపై నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న గంగారాం కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటన తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ యోగితారాణా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావుతో ఫోన్లో చర్చించి మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందేలా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement