వాహనచోదకులను అడ్డగించి, దోచుకుంటున్న నకిలీ పోలీసును మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.22 వేల నగదు
మండపేట : వాహనచోదకులను అడ్డగించి, దోచుకుంటున్న నకిలీ పోలీసును మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.22 వేల నగదు, మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను మండపేట సీఐ హ్యాపీ కృపావందనం వివరించారు. మండపేట మండలం జెడ్.మేడపాడుకు చెందిన పసుపులేటి నాగేశ్వరరావు గతంలో ద్వారపూడిలోని వస్త్రమార్కెట్‌లో పనిచేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పని మానేసిన అతడు డబ్బు కోసం పోలీస్‌గా చెలామణి అయ్యాడు. బైక్‌లను అడ్డగించి, వాహనదారుల వద్ద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు.
గత నెల 28న బైక్‌పై వెళుతున్న మండపేటలోని రావులపేటకు చెందిన కంది సూర్యారావును స్థానిక పెదకాలువ వంతెన సమీపంలో అడ్డగించాడు. పోలీసునని చెప్పి రికార్డులు చూపమని బెదిరించాడు. ఇంటి వద్ద ఉన్నాయని సూర్యారావు చెప్పగా, ఫైన్ కట్టాలంటూ అతడి జేబులో ఉన్న రూ.31 వేలు లాక్కుని నాగేశ్వరరావు పరారయ్యాడు. అలాగే ఆలమూరు మండలం పినపళ్లకు చెందిన కాకి శ్రీను ఈ నెల రెండున బైక్‌పై వెళుతుండగా.. అయ్యప్పస్వామి ఆలయం వద్ద నాగేశ్వరరావు అడ్డగించాడు.
రికార్డు కోసం బెదిరించి.. అతడి జేబులో ఉన్న రూ.12 వేల నగదు లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పెద్దకాలువ వంతెన సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారణ చేయగా, ఆయా నేరాలను అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.22 వేల నగదుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడిని ఆలమూరు కోర్టుకు తరలిస్తామన్నారు. నిందితుడిని పట్టుకున్న పట్టణ పోలీసులను రామచంద్రపురం డీఎస్పీ బి.రవీంద్రనాథ్ అభినందించారు.