నిందితులను గుర్తించమని బాధితులకు సీసీ కెమెరా ఫుటేజీ చూపిస్తున్న క్రైం సీఐ పైడపునాయుడు
విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం(గాజువాక): దుండగులు కొత్తరకం ఎత్తుగడలతో జనాన్ని బురిడీ కొట్టించి బంగారం అపహరించుకుపోయారు. ఏకంగా క్రైం పోలీసులమని చెప్పి సుమారు పదమూడున్నర తులాల బంగారం దోచుకుపోయారు. ఈ ఘటనలు కొత్త గాజువాక, నగరంలోని సిటీ సెంట్రల్ పార్కు వద్ద గురువారం చోటుచేసుకున్నాయి. గాజువాక క్రైం సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, కంచిలి గ్రామానికి చెందిన పోలేశ్వరరావు గాజువాక పైడిమాంబకాలనీలో తన మనుమరాలి పుష్పవతి కార్యక్రమానికి వచ్చాడు. కార్యం అనంతరం తన స్వగ్రామం వెళ్లేందుకు గురువారం ఉదయం వరుసకు తమ్ముడైన శంకర్రావుతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లేందుకు కొత్తగాజువాక హైస్కూల్ రోడ్డు జంక్షన్ వద్ద వేచి ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి... తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు.
పోలేశ్వరరావును ఉద్దేశించి మెడలో బంగారు చైను, రెండు చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు చూసి దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తిని పిలిచి అతడి చెంపపై కొట్టి మెడలో బంగారు చైను తీసి దాచుకోవాలని చెప్పాను కదా అంటూ ఓవర్ యాక్షన్ చేశారు. (ఆ వ్యక్తి దొంగతనానికి పాల్పడిన వారికి సంబంధించిన వాడేనని పోలీసులు అనుమానిస్తున్నారు). అనంతరం అగంతకులు పోలేశ్వరరావు మెడలో ఉన్న చైను, చేతులకు ఉన్న నాలుగు ఉంగరాలు, మనుమరాలి కోసం తెచ్చి తిరిగి తీసుకెళ్లిపోతున్న నక్లెస్, తన సోదరుడు శంకరావు చేతికి ఉన్న రెండు ఉంగరాలను తీయించి ఒక గుడ్డలో మూటకట్టారు. అనంతరం పోలేశ్వరరావు వద్ద గల బ్యాగులో పెడుతున్నట్లు నటించే సమయంలో ఒక చేతి రుమాలును దుండగులు తీసి గట్టిగా దులిపారు. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరికీ కొంత మగతగా ఉన్నట్లు అనిపించడంతో అగంతకులు ద్విచక్ర వాహనంపై బంగారంతో ఉడాయించారు. దీంతో అవాక్కయిన బాధితులు లబోదిబోమంటూ గాజువాక పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనలో 12 తులాలు బంగారం ఆపహరణకు గురైందని పోలీసులు తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని సీఐ పరిశీలించారు. నిందితులను గుర్తించమని బాధితులకు కూడా ఫుటేజీ చూపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోర్నింగ్ వాక్ నుంచి వెళ్తుండగా...
అల్లిపురం(విశాఖ దక్షిణం): పోలీసులమని చెప్పి బంగారం అపహరించిన ఘటన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైం ఎస్‌ఐ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం ప్రాంతానికి చెందిన మజ్జి వెంకటరావు(85) గురువారం ఉదయం మోర్నింగ్ వాక్‌కు సెంట్రల్ పార్కుకు వెళ్లారు. తిరిగి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా సుమారు 9.20 గంటల ప్రాంతంలో సౌత్ జైలురోడ్డులో నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అతని వద్దకు వచ్చి ఆపారు. తాము క్రైం పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు. బంగారం కనిపించే విధంగా పెట్టుకుని వెళ్తే దొంగల బెడద ఎక్కువుగా ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అతని మెడలో గల చైన్, చేతికి ఉన్న ఉంగరాలు (సుమారు తులమున్నర బరువు) తీయించి రుమాలులో కట్టి జేబులో పెట్టుకోవాలని సూచించి వెళ్లిపోయారు. అనంతరం అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన వెంకటరావు తన జేబులోని రుమాలు తీసి చూసుకోగా అందులో బంగారు వస్తువులు కనిపించలేదు. రాళ్లు ఉండడంతో అవాక్కై పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే క్రైం ఎస్‌ఐ భాస్కరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. జరిగిన ఘటనను బట్టి దోపిడీకి పాల్పడిన వారు పాతనేరస్తులుగా భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment