సాక్షి, హైదరాబాద్ : మనిషి...మనిషితో అనుబంధం వైఎస్‌ఆర్ కుటుంబమైతే... రాష్ట్ర ప్రజలకు, సొంత మామకే వెన్నుపోటు చంద్రబాబు కుటుంబమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు కళావతి, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమానికి అద్భుత స‍్పందన వస్తోంది. ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 4 లక్షల మంది సభ్యులుగా చేరారు. వైఎస్‌ఆర్ కుటుంబంలో డిజిటల్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా చేరొచ్చు. www.ysrkutumbam.com కు లాగాన్ అయి సభ్యులుగా చేరవచ్చు. వైఎస్‌ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకువచ్చి ...చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.
కాగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం’ ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలసి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
అలాగే వైఎస్సార్ కుటుంబంలో చేరాలనుకునే వారు 9121091210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఇలా మిస్డ్‌కాల్ ఇస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది. కాగా ప్రకాశం జిల్లా రాయవరం కల్యాణ మండపంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వైఎస్‌ఆర్ కుటుంబం ప్రారంభమైంది. ఇందులో టౌన్ కన్వినర్ కృష్ణ, రైతు విభాగం నేత పోతి రెడ్డి, నర్సింహారావు, పలువురు జడ్పీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.