సాక్షి, అమరావతి: వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం రెండో రోజూ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఏపీ అన్ని జిల్లాల్లో చురుగ్గా కార్యక్రమం జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబంలో చేరేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తిరుపతిలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ కుటుంబంలో చేరడానికి జనం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వైఎస్సార్ జిల్లాలో జరిగిన యూత్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ సైనికులు కదలాలని పిలుపునిచ్చారు.