ఉత్తుత్తే!
►ఖరీఫ్, రబీ ముగిసినా దిక్కులేని యాంత్రీకరణ
►రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గిన బడ్జెట్
►‘మీ-సేవ’ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కొర్రీలు
►పూర్తి ధర చెల్లిస్తే రాయితీ జమ చేస్తామని మెలిక
►వ్యవసాయ, ఉద్యాన శాఖలో అమలు కాని పథకం
►నేడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అటకెక్కింది. ఖరీఫ్, రబీ పంట కాలాలు ముగిశాయి. ఒకటిన్నర నెలలో ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ తక్కువ సమయంలో జిల్లాకు కేటాయించిన యాంత్రీకరణ బడ్జెట్ ద్వారా ఎంతవరకు ప్రయోజనం చేకూర్చిపెడతారో అంతుచిక్కడం లేదు. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాల ప్రగతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టి సారించి న్యాయం చేస్తారా.. లేక చూసీచూడనట్లు వెళతారా అనేది మంగళవారం జిల్లా పర్యటనలో తెలియనుంది.
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కారు కొలువుతీరి తొమ్మిది నెలలు కావస్తున్నా పథకాల అమలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోరుుంది. మిగతా జిల్లాల పరిస్థితి ఎలాగున్నా కరవు పరిస్థితులు నెలకొన్న ‘అనంత’లో మాత్రం రైతుల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలను పరిష్కరించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రైతులకు రూ.10 కోట్లు వెచ్చించి అన్ని రకాల యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి 50 శాతం రాయితీతో అందజేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ధరలు, రాయితీలు ఖరారు చేయడానికి కాలమంతా వెచ్చించారు. చివరకు గత డిసెంబర్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌ను రూ.5 కోట్లకు కుదించారు. అదైనా సకాలంలో వ్యయం చేసి అమలు చేశారా అంటే అదీ లేదు. కనీసం స్ప్రేయర్ కూడా పంపిణీ చేయని దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో యాంత్రీకరణ పనిముట్లు అవసరమైన రైతులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు పెట్టడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.
వివిధ సాంకేతిక కారణాలతో మీ-సేవా కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో పాటు అధికారులు, రైతులు, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులకే సరైన అవగాహన లేక దరఖాస్తుల అప్‌లోడ్ కష్టంగా మారింది. మూడు నెలలు కావస్తున్నా 30 దరఖాస్తులు కూడా అప్‌లోడ్ కాకపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మీ-సేవా కేంద్రాల ద్వారా పెలైట్‌గా తీసుకుని ఒక మండలం లేదా ఒక వ్యవసాయ సబ్‌డివిజన్‌లో అమలు చేసివుంటే కొంత ఫలితం ఉండేది.
అలా ఒకట్రెండు సంవత్సరాల్లో విస్తరిస్తే పథకం అమలు సాఫీగా సాగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముందూ వెనుకా ఆలోచించకుండా ఒక్కసారిగా మీ-సేవాలో ఆన్‌లైన్ చేసుకోవాలనే నిబంధన పెట్టి బడ్జెట్ ఖర్చు కాకుండా యంత్ర పరికరాలు రైతులకు అందకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది. జిల్లాకు కేటాయించిన రూ.5 కోట్లు ఖర్చు చేసి సుమారు 2,500 యంత్రోపకరణాలు ఎపుడిస్తారో అధికారులకే తెలియడం లేదు.
ఉద్యానశాఖదీ అదే పరిస్థితి
ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ పరిస్థితి అలాగే ఉంది. ఉన్నఫలంగా నిబంధనలు మార్పు చేయడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. స్ప్రేయర్ కావాలన్నా మొదట పూర్తి ధర చెల్లిస్తే తరువాత.. రాయితీ రైతు ఖాతాలో జమ చేస్తామని మెలికపెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఉద్యాన శాఖకు ఇపుడు కొత్త నిబంధన జారీ చేయడంతో అధికారుల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంమ్మీద అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన శాఖ యాంత్రీకరణ పథకం అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
యాంత్రీకరణ పథకం కింద కేటాయింపులిలా...
►ఎద్దులతో లాగే పరికరాలు 120 యూనిట్లకు రూ.30 లక్షలు
►ట్రాక్టర్‌తో లాగే యంత్రపరికరాలకు రూ.1.20 కోట్లు
►ఇంప్రూవ్డ్ ఫార్మ్ పరికరాలు 20 యూనిట్లకు రూ.40 లక్షలు
►250 రోటోవీటర్స్‌కు రూ.1.25 కోట్లు
►10 హార్వెస్టర్లకు రూ. 50 లక్షలు
►వివిధ రకాల స్ప్రేయర్లు 80 యూనిట్లకు రూ.60 లక్షలు
►300 డీజిల్ ఇంజన్ల పంపిణీకి రూ.30 లక్షలు
►పవర్ టిల్లర్స్‌కు 10 యూనిట్లకు రూ.6 లక్షలు కేటాయింపు
► ఆర్‌కేవీవై (రాష్టీయ కృషి వికాస్ యోజన) కింద కేటాయింపులు ఇలా..
►వేరుశనగ సీహెచ్‌సీ కింద 12 యూనిట్లకు రూ.90 లక్షలు
►పోస్ట్ హార్వెస్టింగ్ పరికరాలు 25 యూనిట్లకు రూ.80 లక్షలు
►హయరింగ్ స్టేషన్స్ (యంత్ర పరికాల అద్దె కేంద్రాలు) 40 యూనిట్లకు రూ.60 లక్షలు
►అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ 1000 యూనిట్లకు రూ.15 లక్షలు
►సోలార్ ఫెన్సింగ్ 30 యూనిట్లకు రూ.15 లక్షలు
►ట్రైనింగ్ అండ్ కెపాసిటీ రెండింటికి రూ.50 వేలు
► సీడ్ అండ్ ఫర్టిలైజర్స్ డ్రిల్లర్లు 90 యూనిట్లకు రూ.15 లక్షలు
►మొక్కజొన్న షెల్లర్స్ 10 యూనిట్లకు రూ. రెండు లక్షలు.
►మల్టీక్రాప్ త్రెషర్స్ 50 యూనిట్లకు రూ.44 లక్షలు
►రోటోవీటర్స్ 54 యూనిట్లకు రూ.27 లక్షలు
►పవర్‌వీడర్స్ 24 యూనిట్లకు రూ.12 లక్షలు కేటాయింపు
►ఇంప్రూవ్డ్ ఫార్మ్ మెషిషనరీస్ 106 యూనిట్లకు రూ.50 లక్షలు
► తైవాన్ స్ప్రేయర్స్ 300 యూనిట్లకు రూ.30 లక్షలు
నేడు మంత్రి పత్తిపాటి రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సోమవారం వెల్లడించారు. మంత్రి ఉదయం 9.00 గంటలకు రామగిరి మండలం వెంకటాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. మధ్యాహ్నం 2.15 నుండి 3.00 పెనుకొండ అతిథి గృహం లంచ్, 3.15 నుండి 3.30 పెనుకొండలో సెరికల్చర్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొని బెంగళూరుకి బయలుదేరి వెళ్లనున్నారు.