ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘పట్టిసీమ’ కేవలం ఒట్టిసీమేనని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు.
రైతు, ప్రజా సమ్యలపై తహశీల్దార్‌కు వినతి
స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
కరువు రైతును ఆదుకోవాలని ఎమ్మెల్యే దేశాయ్ డిమాండ్
మదనపల్లె: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘పట్టిసీమ’ కేవలం ఒట్టిసీమేనని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు స్థానిక తహశీల్దార్ శివరామిరెడ్డికి పలు సమస్యలపై సోమవారం వినతి పత్రం అందజేశారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పట్టిసీమ కోసం విడుదల చేసిన జీవోలో రాయలసీమకు నీళ్ల ప్రస్తావనే లేదన్నారు. పట్టిసీమ నుంచి తరలించే నీరు ఎక్కడ నిల్వ ఉంచుతారో చెప్పమంటే ప్రభుత్వం నీళ్లు నములుతోందని దుయ్యబట్టారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి నివారించాలని, రైతు, రైతు కూలీల వలసలు నివారించాలని, కరువు, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు తక్షణం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం... స్వామి నాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ధర లేనప్పుడు రైతుకు మద్దతుగా నిలబడేందుకు రూ:5000 కోట్లతో మార్కెట్ ఇంటర్ వెర్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు.
పంటలకు బీమా అమలు చేయాలని, వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ తక్షణం మాఫీ చేయాలన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించాలంటే హంద్రీ-నీవాను పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజక్టుపై నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. హంద్రీ-నీవాకు రూ:2000 కోట్లు అవసరముంటే, బడ్జెట్‌లో కేవలం రూ:200 కోట్లు మాత్రమే మంజూరు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజనాబాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బాలగంగాధర్‌రెడ్డి, జింకా వెంకటచలపతి, ఖాజా, సర్పంచ్ శరత్‌రెడ్డి, జిల్లా టెలికాం సభ్యులు దండాల రవిచంద్రారెడ్డి, ఎంటీటీసి శ్రీకాంత్, నాయకులు బాలకృష్ణారెడ్డి, రఫీఖ్ అహ్మద్,మల్లికార్జున, తట్టి నాగరాజురెడ్డి, బుల్లెట్ షఫీ, సూరి, రాజు, దేవ, నూర్, అంబేడ్కర్ చంద్రశేఖర్, కొండయ్య, కోటూరి ఈశ్వర్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.