రుణం.. వ్రణం | farmers again crisis as a debit loans | Sakshi
Sakshi News home page

రుణం.. వ్రణం

Published Mon, Jul 21 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

రుణం.. వ్రణం

రుణం.. వ్రణం

ఖరీఫ్‌లో ఒక్క రైతుకూ రుణం ఇవ్వలేదు
- తొలి త్రైమాసికంలో పైసా కూడా విదల్చని బ్యాంకులు
- గతేడాది ఇదే సమయానికి రూ.600 కోట్ల రుణాల మంజూరు
- రుణమాఫీ జాప్యంతో ఆర్థిక సంక్షోభంలో అన్నదాత

సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీ జాప్యంతో జిల్లాలోని అన్నదాతలు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతున్నారు. అప్పులు తెచ్చి.. పెట్టుబడిగా పెట్టి.. వాతావరణం అనుకూలించక కన్నీళ్ల దిగుబడితో కొన్నేళ్లుగా కష్టాల సాగును నెట్టుకొస్తున్న జిల్లా రైతులు ఈసారి రుణమాఫీ జాప్యం పుణ్యమా అని కనీసం అప్పులు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలైనా బ్యాంకుల నుంచి అన్నదాతకు నయాపైసా కూడా రుణం అందలేదు. గత ఆర్థిక సంవత్సరం (2013-14) ఖరీఫ్ సీజన్ తొలి త్రైమాసికంలో వివిధ బ్యాంకుల నుంచి రైతులు రూ.600 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.4,374 కోట్లు కాగా, రూ.6,084 కోట్లను బ్యాంకులు రైతులకు అందించారు.

ఆ ఏడాది లక్ష్యానికి మించి అప్పులు తీసుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లక్ష్యాన్ని రూ.5,221 కోట్లకు పెంచారు. కానీ రుణమాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు వేయడం, రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టత లేకపోవడంతో జిల్లాలో బ్యాంకర్లు ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వలేదు. పాత రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని పూర్తిగా పక్కన పెట్టేశారు. జాతీయ బ్యాంకులే కాదు సహకార సంఘాలదీ ఇదే దారి. జిల్లాలోని 253 సహకార సంఘాల్లో 2.60 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.

మొత్తంగా ఈ సొసైటీలకు సంబంధించి రూ.1,182.54 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, దీనిపైనా స్పష్టత లేకపోవడంతో సొసైటీలు కూడా రైతులకు రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు రుణాల కోసం వచ్చే రైతులతో  ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు. రీ షెడ్యూల్ చేసినా మీకే భారం. వడ్డీ పెరుగుతుంది. చక్రవడ్డీ పడుతుంది. పాత రుణం ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని బ్యాంకర్లు తేల్చిచెప్పేస్తున్నారు.
 
తగ్గనున్న సాగు  
రుణాలు లభించని కారణంగా జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. వరుణుడు ఇన్నాళ్లూ దోబూచులాడినా అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు దుక్కులు, దమ్ములు చేసుకునే వాతావరణం రావడంతో ఇప్పటికే నాట్లు ఊపందుకోవాలి. కానీ.. ఎక్కడా వ్యవసాయ పనులు పుంజుకోవడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 3,24,749 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 2,38,506 హెక్టార్లలో వరి సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలి త్రైమాసికంలో ఇప్పటివరకూ జిల్లాలో కేవలం 32 వేల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు వేశారు. మరో 9,300 హెక్టార్లలో నారుమళ్లు సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే పరిస్థితి నెలకొంది.
 
ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
ఖరీఫ్ సీజన్ అదును దాటిపోవడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం తెలియని అన్నదాతలు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఎక్కువ వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమవుతుందోన్న ఆందోళన రైతన్నను వెంటాడుతోంది. మరో వైపు ప్రైవేటు వ్యాపారులు వసూలు చేసే అధిక వడ్డీలతో రైతులు మరింత దివాళా తీసే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తోందని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement