ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు?
సుమారు 4,600 ఎకరాల్లో గసగసాల సాగు
రైతులను చైతన్య పరచని అధికారులు
నిషేధం పేరుతో పంటొచ్చే దశలో ధ్వంసం
దాదాపు రూ.15 కోట్ల పెట్టుబడులు మట్టిపాలు
అన్నదాతకు అడుగడుగునా కష్టాలే. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో ఆరేళ్ల నుంచి గసగసాల పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పంట చేతికొచ్చే దశలో అధికారులు పంటను ధ్వంసం చేశారు. దీంతో సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. దీంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ చోద్యం చూస్తోంది. పోలీసు దాడులతో దిక్కుతోచక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
తిరుపతి: పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం మండలాలతోపాటు సోమల మండలంలో కలిపి దాదాపు 1500 మంది రైతులు 4,600 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అంచనా వేశారు. ఎకరాసాగు కోసం సరాసరిని రూ.30,000 ఖర్చు చేశారు. ఈ పంట సాగుకు కోసం అన్నదాతలు దాదాపు రూ.15 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో వెచ్చించారు. పంటను ఆరేళ్ల నుంచి మెయిన్ రోడ్డుల పక్కన, పుణ్యక్షేత్రమైన బోయకొండ సమీపంలోనే సాగు చేస్తున్నారు. అనునిత్యం ఎంతో మంది ఉన్నతాధికారులు పంటను చూస్తూ వెళ్లినా ఏనాడు పంట వేయవద్దని వారించలేదు. ఆభరోసాతోపాటు కొంతమంది వ్యాపారుల మోసపూరిత మాటలు నమ్మి రైతులు పంటను సాగు చేశారు. రెండు రోజులుగా ఎక్సైజ్ డీసీ సత్యప్రకాశ్, పలమనేరు డీఎస్పీ శంకరరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు పంటను ధ్వంసం చేస్తూ అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
కొట్టొచ్చిన అధికారుల నిర్లక్ష్యం..
ఎక్సైజ్, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిటి శాపంగా మారింది. చెన్నైలో కొకైన్ పట్టు పడటంతో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇది ఎక్కడి నుంచి సరఫరా ఆవుతుందని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గసగసాల పంట, పొట్టు జిగురు నుంచి ఈ పదార్థాలు తయారవుతున్నాయని అనుమానం చ్చింది. దీంతో కొన్ని మొక్కలను పరిశీలనార్థం కేంద్ర కార్యాలయానికి పంపారు. చివరకు వారి అనుమానమే నిజమైంది. దీనిలో ఓపీయం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. అంతవరకు దాదాపు ఆరేళ్ల పాటు నిద్ర మత్తులో జోగాయి.
అధికారులు మందుజాగ్రత్తగానే దృష్టి సారించి ఈ పంట నిషేదిత పంట వేయకూడదని చైతన్య పరిచి ఉంటే అన్నదాతలు నష్టపోయి ఉండేవారు కాదు. దీనికితోడు రెవెన్యూ అధికారులు సైతం ఏ పంట సాగు చేసింది అడంగల్‌లో వివరాలను ఏటా నమోదు చేస్తారు. ఈ పంట వివరాలను సైతం సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో రెవెన్యూ అధికారుల డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొంత పరిమిత విస్తీర్ణంలోనే దీన్ని సాగు చేస్తారు. ఇక్కడ ఈ పంట సాగు అవుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. కొన్ని శాఖల అధికారులకు మాముళ్లు అందటంతో ఇన్ని రోజులు చూసీ చూడనట్లు వదలి వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.