
ఆక్రమిత చెరువు గర్భాన్ని పొక్లెయిన్‌తో చదును చేయిస్తున్న దృశ్యం
సాక్షి, విశాఖపట్నం: తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన చెక్ పెట్టారు. వారు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆ ప్రాంతాన్ని పొక్లెయినర్‌తో చదును చేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ ఐదేళ్ల పాలనలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చెరువు గర్భాలను కబ్జా చేసేశారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న ఆయకట్టుకు సాగునీరందకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించి కనబడిన చెరువులను ఆక్రమించేశారు. రైతుల పంటలకు నీరిచ్చే సాగునీటి చెరువులనూ వదల్లేదు. దీనిపై రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న సంఘటనలూ లేకపోలేదు. ఇటువంటి ఆక్రమణల తొలగింపునకు స్థానిక అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు.
జేసీ జోక్యంతో ఆగడాలకు కళ్లెం...
జేసీ జి.సృజన భూకబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేశారు. టీడీపీ నాయకుల బారి నుంచి చెరువును కాపాడి ఆయుకట్టు రైతులకు అప్పగించారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 354లో 7.68 ఎకరాల వెంకన్న చెరువు ఉంది. దీనిని టీడీపీకి చెందిన గూడుపు దేముడు తదితర గ్రామస్థాయి నాయకులు కబ్జా చేశారు. ఆయుకట్టు రైతులను బెదిరించి అందులో వ్యవసాయం చేస్తున్నారు. ఈ మేరకు ఆయుకట్టు రైతులు గతేడాది అక్టోబర్ 29న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆమె పరిశీలించి తక్షణం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ శశిభూషణ్ ఆదేశాల మేరకు జేఈ జి.పైడితల్లి , బుచ్చెయ్యపేట తహసీల్దార్ శుభాష్‌బాబు, స్థానిక వీఆర్వో నారాయణరావు ఆక్రమణల ప్రాంతంలో సర్వే చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానిదని, ఎవరైనా ఆక్రమిస్తే సెక్షన్4(1), 4(2), 4(3) ఏపీ ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 183,186, 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక బోర్డుల్లో పేర్కొన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన రైతులు..
ఆక్రమిత చెరువుకు కబ్జాదారుల నుంచి విముక్తి కలిగించినందుకు ఆయుకట్టు రైతులంతా జేసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా గ్రామంలో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ ఆక్రమితదారుల నుంచి కాపాడి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.