‘ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం...’ ఎన్నికల ముందు ఈ మాట దాదాపు ప్రతి రోజూ చంద్రబాబు నోట వినిపించింది.
నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు
రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే
‘వంశధార’పైనే అందరి ఆశలు
‘ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం...’ ఎన్నికల ముందు ఈ మాట దాదాపు ప్రతి రోజూ చంద్రబాబు నోట వినిపించింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ మాటను పట్టించుకోలేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా సాగునీటి బడ్జెట్‌లపై కరుణ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వంశధార, తోటపల్లిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఇంకొన్ని కలలూ బడ్జెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
వంశధార పరిస్థితి ఇలా..
వంశధార ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.1650 కోట్లకు పెంచారు. అయితే గత బడ్జెట్‌లో కేవలం రూ. 92 కోట్లు కేటాయించి పాల కులు చేతులు దులుపుకున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా కేటాయింపులు జరగాల్సి ఉంది. అలాగే ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రెండో దఫా శంకుస్థాపన చేశారు. మొదటి దానికే దిక్కులేదు. రెండోసారి శంకుస్థాపన చేయడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
గత బడ్జెట్‌లో కేటాయింపులిలా..
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు రూ.243.25 కోట్లు కేటాయింపులిచ్చారు. ఇందులో తోటపల్లి కాలువలకు రూ.161.98 కోట్లు, వంశధార ప్రాజెక్టు స్టేజ్-1కు రూ.17.99 కోట్లు, స్టేజ్-2కు రూ.52.28 కోట్లు, ఆఫ్‌షోర్‌కు రూ.6 కోట్లు, మడ్డువలస కాలువలకు రూ. 5 కోట్లు కేటాయించారు. వీటితోపాటు నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంను గత బడ్జెట్‌లో మంజూరు చేశారు.
‘భావనపాడు’కు కేటాయింపులు నిల్
గత బడ్జెట్‌లో భావనపాడు, కళింగపట్నం మినీ పోర్టులు నిర్మిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. భావనపా డు పోర్టు నిర్మాణానికి ప్రైవేటు భాగస్వామ్యంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు ఇవ్వలేదు.
కానరాని పర్యాటకం
బారువా తీరంలో పర్యాటకాభివృద్ధికి నిధులు కేటాయించడంతోపా టు టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు.
జిల్లాలోని తోటపల్లి కాలువ, గెడ్డల (మురుగు నీటి పారుదల వ్యవస్థ) ఆధునికీకరణకు రూ. 271 కోట్లతో గత ఏడాది జలవనరుల శాఖ సమగ్ర నివేదిక ఇచ్చింది.
గెడ్డల ఆధునికీకరణ కు రూ. 111 కోట్లుతో గతంలో జలవనరుల శాఖ ఇన్విస్టిగేషన్ డివిజన్ నివేదికను ప్రభుత్వానికి పంపింది. రెల్లిగెడ్డతో సహా మొత్తం 52 గెడ్డల ఆధునికీకరణకు రూ. 90.98 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన నిధులు రాలేదు.
నాగావళి, బాహుద, మహేంద్రతనయ నదుల ఓపెన్‌హెడ్ చానెళ్ల ఆధునికీకరణకు నిధులివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
తోటపల్లి ప్రధాన కాలువలకు లైనింగుతో సహా వివిధ అడ్డంకులను అధిగమించే విధంగా మార్గమధ్యలో కట్టడాలను నిర్మించి పూర్తిస్థాయిలో కాలువలను ఆధునికీకరించేందుకు రూ. 124.83 కోట్లు గతంలో కోరినా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
మడ్డువలస...
రెండో దశ కింద చేపట్టిన మడ్డువలస జలాశయం నిర్మాణం సహా కాలువల లైనింగు, పిల్ల కాలువల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు రూ. 14 కోట్లు అవసరం ఉందని గత ఏడాది అంచనా. అది ఇప్పుడు రూ.19 కోట్లకు చేరింది. గత బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాలేదు.
‘కరకట్టల’ను కరుణిస్తారా?
వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణాల పైనా స్పష్టత లోపిస్తోంది. సుమారు రూ. 175 కోట్లు తో 177 కి.మీ పొడవునా నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. పాత ఒప్పందాల మేరకు కాంట్రాక్లర్లు చేసే పరిస్థితి లేదు. కొత్త రేట్లు ఇచ్చే అంశంపై ఎటూ నిర్ణయం తీసుకోలేదు.
హామీల మాటేంటి?
తీర ప్రాంతంలో భావనపాడు, కళింగపట్నం ఓడ రేవులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. భావనపాడు ఓడరేవు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అక్కడ రేవు నిర్మాణంపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఇండియన్ పోర్టు అసోసియేషన్ ఎకనమిక్ ఫీజుబులిటీ (టీఈఎఫ్)పై సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం శ్రద్ధ కనబరచింది. ఆదిలోనే ఈ ప్రాజెక్టును ప్ర జలు వ్యతిరేకించడంతో అవాంతరాలు వచ్చి పడ్డాయి. మరో వైపు మూడు సంస్థలు ఈ పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఇప్పటికే విశాఖపట్నం పోర్టు నిర్మాణానికి సానుకూలతతో ఉంది.
మరోవైపు నిర్మించు-నిర్వహించు-అప్పగించు (బీఓటీ) పద్ధతితోపాటు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా గానీ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలతో ఉమ్మడిగా గాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ను రూపొందించిన గత బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఈసారైనా బడ్జెట్‌లో కేటాయింపులు వస్తాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కళింగపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన సర్వేలు జరిపిన ప్రభుత్వం నిన్నటివరకు యాంకరు పోర్టుతోపాటు డ్రె డ్జింగ్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. ఇప్పటికే డ్రెడ్జింగ్‌ను అంతర్వేదికి తరలించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించడంతో జిల్లా ప్రజలకు ఆ ఆశ అడియాశగా మారింది.
‘ఆశ్రమం’ లేదు
జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మారుస్తామని గత బడ్జెట్‌లో ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో సౌర విద్యుత్ వినియోగం పెంచడానికి 770 సోలార్ పంపుసెట్లు ఇస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుత అవసరాలెన్నో
అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో కేటాయింపులిచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 62 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 58 వేల ఎకరాలు కొత్తగా సస్యశ్యామలం అవుతాయని అంచనా. గత బడ్జెట్‌లో కేటాయించి నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుకాలేదు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా ధరలు పెరిగితే తప్ప తోటపల్లి నుంచి పూర్తిస్థాయిలో నీరు అందించడం సాధ్యం కాదు.