
ప్రస్తుతం గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నీటి ప్రవాహం
వంశధార నది... జిల్లాలో అతిపెద్ద నది! కానీ ఆయకట్టుకు నీటి సమస్య తీరట్లేదు! ఏటా 50 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది! దీనికి కాస్తయినా అడ్డుకట్ట వేస్తే మండు వేసవిలోనూ గలగలమని జలాలను పొలాల్లో పారించవచ్చు! ఇది జిల్లా ప్రజల దశాబ్దాల కల! దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ కలలను సాకారం చేయడానికి 2006 సంవత్సరంలో సంకల్పించారు.
అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు, దివంగత ప్రఖ్యాత ఇంజనీరు సీఆర్‌ఎం పట్నాయక్‌ల చొరవ, ప్రణాళిక అందుకు ముందుకు నడిపించాయి. వారి సంకల్పం ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది. వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలోకి ఈనెల 10వ తేదీ నుంచి గంగమ్మ అడుగుపెట్టనుంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వాస్తవానికి వంశధార రెండు దశల ప్రాజెక్టు... రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం ముఖ్యంగా రాష్ట్రంలోకెల్లా అభివృద్ధిలో వెనుకబడిన ఈ జిల్లాలో 2.55 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం తలపెట్టిన కార్యక్రమం. 1962వ సంవత్సరంలోనే దీనికి పునాదిరాయి పడినా స్టేజ్–1 గొట్టా బ్యారేజీకే పరిమితమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఫేజ్–2 స్టేజ్–2 పనులు వేగవంతమయ్యాయి.
కానీ 2009 సంవత్సరంలో ఆయన అకాల మరణం ఈ పనులకు శాపమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు పనులపై హడావుడి మొదలెట్టింది. కేవలం రూ.421 కోట్ల మేర నిధులిచ్చి యూత్ ప్యాకేజీ పేరుతో కొంతమేర పరిహారం చేతిలో పెట్టింది. మరోవైపు 87 ప్యాకేజీ పనులు 40 శాతం, 88 ప్యాకేజీ పనులు 35 శాతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. హిరమండలం జలాశయం పనులు మాత్రం 20 శాతం పూర్తి చేయాల్సి ఉంది. అయితే జలాశయంలో ప్రస్తుతానికి నీరు నింపడానికి ఇబ్బంది ఉండదు.
స్థానిక వనరులే కీలకం..
వాస్తవానికి వంశధార నదిలో నుంచి వచ్చే వరద నీటిని భామిని మండలంలోని కాట్రగడ–బి వద్దనున్న సైడ్‌వియర్ నుంచి వరదకాలువలోకి మళ్లించాల్సి ఉంటుంది. ఆ కాలువ ద్వారా భామిని మండలంలోని సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి, తర్వాత కొత్తూరు మండలంలోని పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీరు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి ప్రధానమైన హిరమండలం జలాశయంలోకి నీరు వస్తుంది.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వంశధార నదినీటి కన్నా స్థానిక క్యాచ్‌మెంట్‌పైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా ఉండే కొండలపై బాగా వర్షాలు పడితే జక్కర్లు ద్వారా తులగాం గెడ్డలోకి దాదాపు రెండు మూడు టీఎంసీల వరకూ నీరు వస్తుంది. హిరమండలం జలాశయం గట్టు పనులు దాదాపు పూర్తికావడంతో ట్రయల్‌రన్‌గా 4 టీఎంసీల నీరు నింపడానికి వంశధార ప్రాజెక్టు ఇంజనీర్లు సన్నద్ధం అవుతున్నారు.
అదే సైడ్‌వీయర్ ద్వారా వరదనీరు రావాలంటే నదిలో కనీసం 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండాలి. ప్రస్తుతం ఆరు వేల క్యూసెక్కులే ఉంది. అందులో ఈలోగా స్థానిక క్యాచ్‌మెంట్ నుంచి వచ్చే నీటిని జలాశయంలోకి మళ్లించనున్నారు.
రెండు నెలల ప్రక్రియ..
హిరమండలం జలాశయంలోకి ఈనెల 10వ తేదీ నుంచి నీరు పారించడానికి ఏర్పాట్లు చేసినట్లు వంశధార ఎస్‌ఈ డి.సురేంద్రరెడ్డి చెప్పారు. కనీసం రెండు నెలల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుందన్నారు. తద్వారా నాలుగు టీఎంసీల నీరు నింపగలిగితే, అది వచ్చే రబీ నాటికి ఆయకట్టులోని 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవైపు స్పిల్‌వే, హెడ్‌రెగ్యులటరీ పనులు వేగవంతం చేస్తూనే ఈ సంవత్సరానికి జలాశయంలో నీరు నిల్వ చేసే ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టరు కె.ధనంజయ్‌రెడ్డి స్పందిస్తూ... ఈ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేయగలిగితే తర్వాత రిజర్వాయర్‌లోకి 8 టీఎంసీల నీటిని నింపే ప్రక్రియను ప్రారంభమవుతుందని అన్నారు. ఇది మూడు దశలలో జరుగుతుందన్నారు. ఏదేమైనా వంశధార రెండో దశ ప్రాజెక్టు జలాలు అందుబాటులోకి వస్తుండటం రైతుల్లో ఆనందాన్ని నింపే విషయమే.
ఎస్ చలువే ఈ ప్రాజెక్టు..
వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఆనాడు రాజశేఖరరెడ్డి చొరవ చూపించకపోతే ఈనాడు ఇలాకూడా చూసుండేవాళ్లం కాదు. జిల్లాపై ప్రత్యేక ప్రేమతో ప్రాజెక్టు పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గతంలో పాలించిన చంద్రబాబు సహా అప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ వంశధారపై ధైర్యం చేయలేకపోయారు. త్వరలోనే వంశధార ఫలాలు రైతులకు అందే అవకాశం కలుగుతుందంటే అది వైఎస్ చలువే. సిక్కోలు ప్రజలకు అపర భగీరథుడు ఎవ్వరంటే ముమ్మాటికీ ఆయన్నే ప్రజలు తలచుకుంటారు.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment