
రైతులు రుణాలు కట్టక్కర్లేదు
చీమకుర్తి: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుందని..రైతులు తీసుకున్న రుణాలు కట్టక్కర్లేదని రోడ్లు, భవనాలు, రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. చీమకుర్తి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రస్తుతం అసెంబ్లీ లేదు, రాజధాని లేదు..పూర్వ వైభవం రావాలంటే కనీసం 30 ఏళ్లకుపైగా పడుతుందన్నారు.
రైతులకు రుణమాఫీ చేద్దామంటే రిజర్వ్ బ్యాంక్ కూడా సహకరించడం లేదన్నారు. అందుకే కొత్తగా రైతు సాధికారిక కార్పొరేషన్ ఈనెల 20న ప్రారంభించనున్నామని మంత్రి శిద్దా తెలిపారు. దాని ద్వారా రూ.5 వేల కోట్లతో రైతులు తీసుకున్న రుణాల్లో ఐదో వంతు తొలివిడతగా తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పింఛన్ల వెరిఫికేషన్‌లో అనేక తప్పులు దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిలో ఒక్కరికి పింఛను తీసేసినా అన్యాయమేనని అన్నారు. ఇప్పటికే చీమకుర్తి మున్సిపాలిటీలో 595, మండలంలో 1165, జిల్లాలో 70 వేలు, రాష్ట్రంలో 9.16 లక్షల పింఛన్లు తొలగించారని గణాంకాలు వెల్లడించారు. వెరిఫికేషన్ల కమిటీలను పక్కన పెట్టి పింఛన్లపై రీసర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ తిరిగి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళల్లో అనుమానాలు పెరుగుతున్నాయని సురేష్ అన్నారు. హామీలు ఇచ్చేముందు ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉండాలని చంద్రబాబు ఇచ్చిన హామీలనుద్దేశించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పార్టీ ఇన్‌చార్జిగా ప్రభుత్వం తర ఫున కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తొలుత ఐసీడీ ఎస్ అధికారులు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్‌ను మంత్రి శిద్దా, ఎమ్మెల్యే సురేష్ పరిశీలించారు. అనంతరం పింఛన్లతో పాటు ఎన్‌ఎఫ్‌బీఎస్ చెక్కులు, స్కాలర్‌షిప్ చెక్కులను మంత్రి, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, మన్నం శ్రీధర్, పమిడి వెంకట్రావు, కాట్రగడ్డ రమణయ్య, రామినేని యోగయ్య, పుట్టా బ్రహ్మయ్య, గొట్టిపాటి రాఘవరావు, కొండ్ర గుంట వెంకయ్య, మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, అవిశనేని వెంగన్న, అడిషనల్ జేసీ ఐ.ప్రకాష్‌కుమార్, తహశీల్దార్ పీ.మధుసూదన్‌రావు, కమిషనర్ ఏజే.మాధ్యూస్, మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బైపాస్‌కు 20 రోజుల్లో శంకుస్థాపన
ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న చీమకుర్తికి బైపాస్‌రోడ్డు నిర్మించేందుకు 20 రోజుల్లో శంకుస్థాపన చేస్తానని మంత్రి శిద్దా అన్నారు. చీమకుర్తి పట్టణానికి గతంలో ఫేజ్-1 కింద 4.71 కి.మీ దూరానికి రూ.9.60 కోట్లతో, ఫేజ్-2 కింద రూ.39 కోట్లతో రెండు రకాల బైపాస్‌లను నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తారని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మంత్రికి వినతిపత్రం రూపంలో విజ్ఞప్తి చేశారు. దానిపై మంత్రి స్పందిస్తూ బైపాస్‌రోడ్డు విషయం తన శాఖకు సంబంధించిందే కాబట్టి దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనేలేదని, 20 రోజుల్లోనే శంకుస్థాపన చేస్తానని చెప్పారు. దాంతో పాటు చీమకుర్తికి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, పార్కు, అంతర్గత రోడ్లు మంజూరు చేసి మోడల్‌టౌన్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి ప్రకటించారు.