అన్నదాత ఆగ్రహం
Published Mon, Oct 21 2013 3:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్:పచ్చి మిర్చి ధర తగ్గింపుపై అన్నదాతలు ఆగ్రహించారు. వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.500 నుంచి 800 మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు తిరగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం బైపాస్ రోడ్‌లోని కూరగాయల మార్కెట్‌కు మన జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల రైతులు కూడా పచ్చిమిర్చి, కూరగాయలు తీసుకొస్తుంటారు. ఆదివారం పలువురు రైతులు పచ్చిమిర్చి తేగానే వ్యాపారులు క్వింటా రూ.1100 చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. దానికి రైతులు అంగీకరించకపోవడంతో రాత్రి 7.30 గంటలకు పాట ఉంటుందని ప్రకటించారు.
అయితే ఆ సమయానికి ముందే కమీషన్ వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.500 నుంచి 800 వరకు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఇదేం అన్యాయమని వారిని నిలదీశారు. రూ.2500 ఉన్న ధరను అమాంతంగా తగ్గించారని మండిపడ్డారు. శనివారం క్వింటాకు రూ.2 వేల చొప్పున చెల్లించగా.. ఇప్పుడు మరీ తక్కువగా కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి వ్యాపారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కమీషన్ వ్యాపారుల దుకాణాలను మూసివేయించి, పక్కనున్న బైపాస్‌రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ధర గురించి వ్యాపారులతో మాట్లాడుదామని చెప్పడంతో రైతులు మార్కెట్‌కు తిరిగి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడున్న కొందరు రైతులు కమీషన్ దుకాణాల ముందున్న విద్యుత్ లైట్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో మార్కెట్‌లో పనిచేసే కార్మికులకు రైతులకు మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టూటౌన్ ఎస్సై సత్యనారాయణ ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కమీషన్ వ్యాపారులకు ఫోన్ చేసి సరుకు కొనుగోలు చేయాలని సూచించారు.
రూ.1000 చొప్పున కొనుగోలు...
కాగా, వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.1000 చొప్పున పచ్చిమిర్చి కొనుగోలు చేశారు. ఆ ధరకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితిలో రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి తీసుకెళ్తే మిర్చి చెడిపోతుందని ఏదోఒక ధరకు విక్రయించామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల వైఖరిపై వారు తీవ్ర నిరసన తెలియజేశారు. కాగా అధివారం రాత్రి వరకు నలుగురు రైతులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.
Advertisement
Advertisement