
స్టేట్ బ్యాంక్‌కు తాళం వేసిన రైతులు
కూడేరు స్టేట్ బ్యాంక్ అధికారుల తీరుపై బుధవారం రైతన్నలు ఆగ్రహించారు. అధికారులను బ్యాంక్‌లోనే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి ధర్నాకు దిగారు.
కూడేరు : కూడేరు స్టేట్ బ్యాంక్ అధికారుల తీరుపై బుధవారం రైతన్నలు ఆగ్రహించారు. అధికారులను బ్యాంక్‌లోనే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా సీపీఎం నాయకులు నాగేష్, ఈరప్ప, వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. కూడేరు స్టేట్ బ్యాంక్‌లో 15వ తేది నుంచి భూమిపై కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో బుధవారం కూడేరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి రైతులు అధికంగా తరలి వచ్చారు. కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులను కోరారు. మేనేజర్ విజయ కుమారి రాకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ రాంప్రసాద్ రైతులతో మాట్లాడుతూ ఫీల్డ్‌ఆఫీసర్‌ని ఉన్నతాధికారులు నియమించలేదు.
కొత్త రుణాలు ఇవ్వాలంటే కొద్ది రోజులు వేచి చూడాలని తెలియజేశారు. దీంతో రైతులు ఆగ్రహించి, ధర్నాకు దిగి బ్యాంక్ మేనేజర్ విజయకుమారి తీరుపై ధ్వజమెత్తారు. ఈ నెల లోపు రుణాలు పొందితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. కాని బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో కొత్త రుణాలు పొందే అవకాశం లేకుండా పోతోందని వాపోయారు. బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి ఫీల్డ్ ఆఫీసర్ నియమించి కొత్త రుణాలను వెంటనే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.
ఫీల్డ్ ఆఫీసర్‌ను నియమించాలి : ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
స్టేట్ బ్యాంక్‌కు ఫీల్డ్ ఆఫీసర్‌ను ని యమించాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి రెండు రోజుల క్రితం జాయింట్ కలెక్టర్, ఆర్‌ఎం దృష్టికి తీసుకుపోయారు. ఫీల్డ్ ఆఫీసర్ లేక రైతులు రుణాలు పొందక తీవ్ర ఇబ్బందిపడుతున్నారని ఎమ్మెల్యే అధికారులకు వివరించారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోతే బ్యాంక్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఎమ్మెల్యే. విలేకరులకు వివరించారు.