అంతా డొల్ల!
నరసరావుపేట రూరల్ : సాగర్ ఆధునికీకరణ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. చిలకలూరిపేట మేజర్‌కు విడుదల చేసిన నీటితో కాలువకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. 200 క్యూసెక్కుల నీటికే ఈ పరిస్థితి ఏర్పడితే.. సామర్ధ్యం మేర నీరు వదిలితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈనెల 18న బుగ్గవాగు నుం చి నీటిని చిలకలూరిపేట మేజర్‌కు విడుదల చేశారు. చిలకలూరిపేటకు మంచినీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశం. మొదట 75 క్యూసెక్కులు విడుదల చేయగా, దాన్ని క్రమేపీ పెంచుతూ 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ నీటితో మంచినీటి చెరువును నింపుతున్నారు. మేజర్ పూర్థి సామర్ధ్యం 370 క్యూసెక్కులు. ఇప్పటివరకు విడుదల చేసిన నీటితో కాలువకు పలుచోట్ల లీకులు ఏర్పడ్డాయి. డ్రాప్‌ల నిర్మాణంలో నాణ్యతను తిలోకదాలు ఇవ్వడమే ప్రధాన కారణం. దీంతోపాటు మైనర్ కాలువలకు వెళ్లే షట్టర్లను కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతో అనేకచోట్ల నీరు వృధాగా పోతోంది. మేజర్ కట్టల పటిష్టతకు వేసిన మట్టి కూడా నీటిలో కొట్టుకుపోతోంది.
నాణ్యత లేని పనులు.. ప్రపంచబ్యాంక్ సాయంతో చిలకలూరిపేట మేజర్‌కు రూ.6కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం మట్టిపనులతో వారు కాలంగడుపుతూ వచ్చారు. ఈ ఏడాది మేజర్ పరిధిలోని కాలువ కట్టలు పటిష్టపరచడం, కాలువలోని పూడికను తొలగించడం, శిథిదిలావస్థకుడ్రాప్ట్‌ల స్థానంలో కొత్తవాటిని నిర్మించే పనిని చేపట్టారు. వీటి నిర్మాణం కూడా నాసిరకంగా జరిగింది. ఈ డ్రాప్‌ల నుంచి నీరు లీకవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లుగా మారడంతో అధికారుల పర్యవేక్షణ లోపించింది. గురవాయిపాలెం సమీపంలో కట్టలు పటిష్టతకు గ్రావెల్ బదులు నల్లమట్టిని వాడారు. దీనిపై రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో అనేకచోట్ల ఏర్పడిన లీకులు కాలువ పటిష్టతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
క్యూరింగ్ చేయకపోవడంతో... చిలకలూరిపేట మేజర్‌లో ఇప్పటికి రూ.2 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కాలువ కట్టలపై కొత్తగా మట్టిని వేయడం వల్ల కొన్ని చోట్ల లీకులు వచ్చాయి. రోలింగ్ చేయడంతో ఈ లీకులు తగ్గుతాయి. నూతనంగా నిర్మించిన డ్రాప్‌లకు సరిగా క్యూరింగ్ చేయకపోవడం వలన నీరు లీకవుతోంది.
- రాజు, ఎన్‌ఎస్‌పీ సర్కిల్ డీఈ