వ్యవసాయ మీటర్లకు గ్రహణం
Published Sat, Aug 17 2013 6:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
ఖమ్మం, న్యూస్‌లైన్ : అన్నదాత అంటే ప్రభుత్వానికి అలుసై పోయింది. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామనే పేరుతో ట్రాన్స్‌కో అధికారులు కూడా రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. విద్యుత్ సరఫరాలోనే కాక కొత్త కనెక్షన్ల మంజూరులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నూతన కనెక్షన్ల కోసం రైతులు డీడీల రూపంలో చెల్లించిన డబ్బు తమ ఖాతాలో వేసుకున్న అధికారులు.. కనెక్షన్లు ఇవ్వకుండానే కాలం గడుపుతున్నారు. వేల సంఖ్యలో రైతు లు దరఖాస్తు చేసుకుంటే వందల సంఖ్యలోనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే కనెక్షన్లు పెరిగితే ప్రభుత్వంపై భారం పడుతుందనే ఉద్దేశంతో మంజూరు చేయకుండానే కాలయాపన చేస్తున్నారు.
జిల్లాలో 7,77,387 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 88,545 కనెక్షన్లు వ్యవసాయ అవరసరాలకే వినియోగిస్తున్నారు. వీటికి రోజుకు సుమారు రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. రోజురోజుకు సాగుభూమి విస్తీర్ణం పెరగడం, నీటివనరుల ఆధారంగా బోర్లు, బావులు తవ్వుకొని వ్యవసాయం చేస్తుండడంతో వీటికి అనుగుణంగా విద్యుత్ కనెక్షన్లు పెంచాలి. కానీ ట్రాన్స్‌కో అధికారులు మాత్రం కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సంవత్సరం 3,632 దరఖాస్తులు రాగా, ఒక్కటి కూడా కొత్త కనెక్షన్ ఇవ్వకపోవడం గమనార్హం. అలాగే 5 హెచ్‌పీ కెపాసిటీ కోసం పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఒక్కో హెచ్‌పీకి రూ.1000 చొప్పున ఐదు వేలు, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 200, సర్వీస్‌చార్జీ పేరుతో రూ. 25 మొత్తం రూ.5,225 డీడీ తీసి దరఖాస్తు ఫారంతోపాటు ఇచ్చారు. వీటిని స్వీకరించిన అధికారులు డీడీ సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారే తప్ప కొత్త కనెక్షన్లు మంజూరు చేయలేదు.
అధిక భారం పడుతుందనే..
ఇతర విద్యుత్ వినియోగదారుల నుంచి సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు, కస్టమ్స్ చార్జీలు.. ఇలా పేద, ధనిక తేడా లేకుండా బిల్లులు వసూలు చేయడానికి అలువాటు పడిన ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై ఆసక్తి చూపడంలేదు. ఉచిత విద్యుత్తేకదా... తమకేం లాభం అన్నట్టుగా వ్యవహరిస్తోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే లైన్లు వే యడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, అదనపు విద్యు త్ సరఫరా వంటి భారం పడుతుందని భావించి న అధికారులు కనెక్షన్ల మంజూరులో జాప్యం చేస్తున్నారు.అదే గృహ అవసరాలు, వ్యాపార, పరి శ్రమలలో విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నెలరోజుల లోపే ఇచ్చే అధికారులు వ్యవసాయానికి అంటే మాత్రం చిన్నచూపు చూ స్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement