అన్నదాతకు హై ‘టెన్షన్’
రైతుల పంట భూముల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు
- నష్ట పరిహారం ఇవ్వకుండా తిప్పుకుంటున్న కంపెనీలు
- కంపెనీలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
- భూమి కోల్పోయినా పరిహారం రాకపోవడంతో ఆందోళన
షాద్‌నగర్: ఎండనకా వాననకా ఆరుగాలం కష్టపడుతూ.. దుక్కి దున్ని పంట పండించుకునే రైతన్నకు కరెంట్ టవర్ షాక్ కొడుతోంది. కంపెనీలు పంట పొలాల్లోనే హైటెన్షన్ (400 కేవీ) విద్యుత్ టవర్లు వేయిస్తుండటంతో.. రైతు లు వేలాది ఎకరాల భూములు కోల్పోతున్నారు. పరిహారం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా అన్నదాతను ఆదుకునే నాథుడే కరువయ్యాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేసినట్లు అంచనా.. దీంతో ఒక కిలోమీటర్ లైన్ వేసేందుకు రైతులు 12 ఎకరాల భూముల్ని కోల్పోతున్నారు.
ఈ లెక్కన 96 వేల ఎకరాల పొలాల్లో నుంచి ఈ హైటెన్షన్ విద్యుత్ టవర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేసినా.. రైతులు 2,400 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తుంది. ఒక టవర్ 700 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు పొలాన్ని ఆక్రమించే ప్రదేశం 150 అడుగుల వెడల్పు ఉంటుంది. టవర్ వైర్లు వెళ్లిన స్థలం శాశ్వతంగా విలువ కోల్పోతుంది. దీంతో ఈ భూమి యజమానులకు సదరు కంపెనీలు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చిన దాఖ లాలు ఎక్కడా కనిపించడం లేదు. విద్యుత్ టవర్ల నిర్మాణానికి రైతుల అంగీకారం తీసుకోవాల్సిన కంపెనీ వారు నిబంధనలేవీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
ఇష్టానుసారంగా టవర్ల నిర్మాణం..
విద్యుత్ చట్టం 2007 ప్రకారం పవర్‌గ్రిడ్, ట్రాన్స్‌కో వారు పొలాల్లో టవర్లను వేసేటపుడు సదరు రైతుకు నోటీసులు జారీ చేయాలి. వారి భూమిలో టవర్‌ను వేయడానికి ముందుగానే మార్కెట్ విలువ ప్రకారం రైతుకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పం దం చేసుకోవాలి. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశానుసారం మార్కెట్ విలువను అంచనా వేసి రైతుకు పరిహారం అందజేయాలి. కానీ, కంపెనీలు ఇవేమీ పాటించకుండానే రైతుల పొలాల్లో టవర్ల నిర్మాణం చేపడుతున్నాయి. కేరళలో భూములు కోల్పోయిన రైతులు కోర్టుకు వెళ్లగా వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేస్తున్నారు.
నష్టపరిహారం అంతంత మాత్రమే..
టవర్లు వేయడానికి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రాంతంలోని పలు గ్రామాల్లోని రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడానికి కంపెనీ వారు ఒప్పందం చేసుకున్నారు. వారికి నష్టపరిహారమివ్వకుండా పొలాల్లో టవర్లను మాత్రం నిర్మించారు. రైతులు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకోగా కంపెనీ వారు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు.
పరిహారం రాలేదు
గ్రామంలో ఉన్న రెండు ఎకరాల పొలంలో హై టెన్షన్ టవర్లు నిర్మించారు. ఇంకా విద్యుత్ వైర్లు లాగలేదు. మాకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఎకరా పొలం రూ.15 లక్షలు పలుకుతోంది. ఇలా రెండు ఎకరాలకు రూ. 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. కార్యాలయాలు, కంపెనీల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. టవర్ బాధిత రైతులందరినీ కలుపుకొని కేసు వేస్తాను.
- రవీందర్‌రెడ్డి, చిల్కమర్రి
సగమే ఇచ్చారు
విద్యుత్ టవర్ కోసం నాకున్న అర ఎకరం పొలా న్ని రెండేళ్ల క్రితం తీసుకున్నారు. పరిహారం ఇవ్వమని కోరితే సంవత్సరంపాటు తిప్పారు. చివరకు కలెక్టర్ వద్దకు వెళితే రూ. 1 లక్షా 5 వేలు ఇచ్చారు. మరో రూ. లక్ష రావాల్సి ఉంది. టవర్ ఉన్న ప్రాంతంలో ఎకరా పొలం రూ.7 లక్షలు పలుకుతోంది. ఆ ప్రకారంగా లెక్కగట్టి మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి.
- రాములు, రంగంపల్లి