చిన్నకోడూరు: విద్యుత్ సమస్యతో పంటలకు నీరందడం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లీపూర్, ఎల్లాయపల్లి, మైలారం గ్రామాలకు చెందిన రైతులు ఎల్లాయపల్లి సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అధికారులు స్పందించకపోవండతో రోడ్డుపై ముళ్లకంప వేసి, సీఎం దిష్టిబొమ్మతో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరఫరాలో తరచూ బ్రేక్‌డౌన్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
విద్యుత్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్, విద్యుత్ సబ్ ఇంజినీర్ కనకయ్యలు అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో సమస్యను ఉన్నతాధికారులకు వివరించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
అట్టుడికిన రామాయంపేట
రామాయంపేట: రాస్తారోకోలు, ఆందోళనలతో మండలం అట్టుడికిపోయింది. విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. మండలంలోని కోనాపూర్, లక్ష్మాపూర్, రామాయంపేట, తొనిగండ్ల, పర్వతాపూర్, ఢి.ధర్మారం గ్రామాలకు చెందిన అన్నదాతలు పెద్దసంఖ్యలో రోడ్లెక్కారు. రెండు రోజులుగా వ్యవసాయానికి రెండు గంటలపాటు కూడా సరఫరా అందడం లేదన్నారు. భారీ సంఖ్యలో వచ్చి ఆందోళన చేపట్టిన వీరిని సముదాయించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లక్ష్మాపూర్ సబ్ స్టేషన్‌కు చేరుకున్న కర్షకులు రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపైన పడుకుని గంటకుపైగా నిరసన చేశారు.
తొనిగండ్ల, ల క్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రామాయంపేట-మెదక్ రహదారిని స్తంభింపజేశారు. రెండు గంటలకుపైగా కొనసాగిన వీరి ఆందోళనతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రయాణికులు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వా దం జరిగింది. పోలీసులు జోక్యంతో రోడ్డుపై ఆందోళన విరమించిన రైతులు సబ్‌స్టేషన్ వద్ద బైఠాయించారు. అక్కన్నపేట, రామాయంపేటకు చెందిన రైతులు స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పర్వతాపూర్‌కు రైతులు లక్ష్మాపూర్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఢి.ధర్మారం రైతులు రామాయంపేట సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ శాఖకు చెందిన అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండాపోయారు.
సబ్ స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం
విద్యుత్ కోతలను నిరసిస్తూ అన్నదాతలు ఆగ్రహం చెందారు. ఆదివారం దొంగలధర్మారం సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను దహనం చేశారు. రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
కోతలపై భగ్గు
Published Mon, Aug 4 2014 4:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement