ఇదేం వ్యవ‘సాయం’?. | Farmers Rabe difficulties in Eluru | Sakshi
Sakshi News home page

ఇదేం వ్యవ‘సాయం’?.

Published Mon, Mar 9 2015 12:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers Rabe difficulties in Eluru

ఏలూరు (టూటౌన్) :రైతన్నలను రబీ కష్టాలు వేధిస్తున్నాయి. సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు కాలువల్లో నీరు లేక చేలు ఎండిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి వెన్నుదన్నుగా ఉండి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు అంతంతమాత్రంగా స్పందిస్తున్నారు. జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారు. వర్షం రాక, కాలువల్లో నీరు లేక  రైతులు సకాలంలో వరినాట్లు కూడా వేయలేకపోయారు. అధికారులు ఎరువులను కూడా పూర్తి స్థాయిలో అందించలేకపోయారు. దీంతోరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రబీకి 2లక్షల 89వేల 453 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయాల్సి ఉండగా వాటిలో 50 శాతం కూడా సకాలంలో అందించలేకపోయారు. దీంతో వ్యవసాయ అధికారులు గోడౌన్‌లలో ఉన్న బఫర్‌స్టాక్‌ను కూడా రైతులకు సరఫరా చేసినప్పటికి పూర్తిస్థాయిలో ఉపయోగం లేకుండాపోయింది. దీనిని అసరాగా తీసుకుని ప్రైవేటు డీలర్లు రైతుల వద్ద అధిక ధరలు వసూలు చేశారు.
 
 అమలు కాని విత్తనోత్పత్తి పథకం
 జిల్లాలో 2014లో ఈ పథకం ద్వారా 50 శాతం రాయితీపై 2125 హెక్టార్లలో వరిపంటకు, 90 హెక్టార్లలో అపరాలను పండించేందుకు ఫౌండేషన్ విత్తనాలు అందించాల్సి ఉండగా అవి పూర్తిస్థాయిలో అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికితోడు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 2014-15 సంవత్సరంలో పూర్తిస్థాయిలో నిధులు రాక అంతంత మాత్రంగానే అధికారులు అమలు చేశారు.  రైతులకు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, పిల్లిపెసర, జీలుగను అధికారులు సరిపడా అందించలేదు.
 
 నష్ట పరిహారం అందలేదు
 జిల్లాలో 2012లో నీలం తుపాను సందర్భంగా లక్షా 29వేల 367 హెక్టార్లలో నష్టపోయిన 2లక్షల 64వేల 50 మంది ైరె తులకు రూ.128.43 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉండగా పూర్తిస్థాయిలో రైతులకు ఇప్పటి వరకూ అందలేదు. 2013లో హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో 78వేల 662హెక్టార్లలో నష్టపోయిన లక్షా 53వేల 207 మంది రైతులకు సంబంధించిన నష్టం రూ.78.66 కోట్ల పెట్టుబడి రాయితీ కూడా రైతన్నలకు పూర్తిగా అందలేదు. అత్యధిక వర్షాల కారణంగా కూడా నష్టపోయిన 38వేల 685 మంది రైతులకు రావలసిన నష్ట పరిహారం రూ 19.96 కోట్ల పెట్టుబడి రాయితీ కూడా ప్రభుత్వం నుంచి రైతులకు అందలేదు.
 
 పొలంబడి అమలు కాలేదు
 పొలంబడి కార్యక్రమం నిర్వహించి సాగు ఖర్చునుతగ్గించి అధిక దిగుబడి సాధించేలా  రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వవలసిన అధికారులు ఖరీఫ్‌లో కేవ లం నాలుగు చోట్ల ఈ కార్యక్రమం జరిపి చేతులు దులుపుకున్నారు.    భూచేతన పథకంలో భూమిలో ఉన్న సూక్ష్మధాతువుల లోపాలను సరిచేసుకొని దిగుబడి పెంచే జింక్ , బోరాన్, జిప్సం కూడా సకాలంలో పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. దీంతో జిల్లాలోని ైరె తులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారు.
 
 ఎరువులు లేక నష్టపోయాం
 పూర్తిస్థాయిలో రైతులకు ఎరువులు సకాలంలో అందించటంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. దీనికితోడు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో మరింతగా నష్టపోయాం.
 - చల్లా రాయప్ప, రైతు, పెదవేగి
 
 నష్ట పరిహారం ఏది?
 రైతులు రెండు సంవత్సరాలుగా తుపానులు, అధిక వర్షాల కారణంగా తీ వ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకూ ఎటువంటి నష్ట పరిహారం అందలేదు. రబీ పంటలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. ప్రభుత్వం కూడా రుణమాఫీ పేరుతో రైతులను అన్ని విధాలుగా మోసం చేసింది.
 -  కొత్తూరి జార్జి, రైతు. పెదవేగి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement