రైతుల సత్తా చాటుదాం | ys Jagan Hunger Strike for Farm Loan Waiver | Sakshi
Sakshi News home page

రైతుల సత్తా చాటుదాం

Published Wed, Jan 28 2015 4:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ys Jagan Hunger Strike for Farm Loan Waiver

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని విస్మరించి వారిని దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని రైతుల సత్తా ఏమిటో తెలిపేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేయనున్న రైతు దీక్ష చరిత్రాత్మకం కాబోతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. మంగళవారం నగరంలోని తన నివాసంలో పార్టీ ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడూ చేయలేని విధంగా తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కోసం ప్రభుత్వంతో పోరాటానికి నాంది పలికారన్నారు. ఇటువంటి చరిత్రాత్మక ఘట్టంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములై సగర్వంగా ప్రజల ముందుకువెళ్లాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 6 నెలల గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాన్నీ ప్రవేశపెట్టకపోవడం పాలనా వైఫల్యంగా అభివర్ణించారు.
 
 రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బృహత్తర అవకాశం వచ్చినా బాబు ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరిట రైతుల పంట భూములను బలవంతంగా లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు రైతు వ్యతిరేక చర్యలేనన్నారు. ఇప్పటికే తనపై ఉన్న రైతు వ్యతిరేక ముద్రను నిజమని ఆయన చర్యల ద్వారా నిరూపించుకుంటున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసునిగా రైతుల సంక్షేమం కోసం ఆ మహనీయుని ఆదర్శాలను అమలు చేయడం కోసమే జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకునిగా చేస్తున్న రైతు దీక్షకు జిల్లాను ఎంచుకోవడం ద్వారా జిల్లాలోని రైతులు, ప్రజలపై ఆయనకున్న అవ్యాజమైన ప్రేమకు తార్కాణమన్నారు.
 
 గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు,  జడ్‌పిటిసిలు వంటి అన్ని స్థానాలనూ టీడీపీకి కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు రిక్త హస్తాలు చూపారన్నారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి రైతులు, ప్రజలు తరలివచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారిలో చైతన్యం తీసుకురావాలని నాని పిలుపునిచ్చారు. దీక్షకు వచ్చే రైతులు, పార్టీ అభిమానులకు అన్ని విధాలా సౌకర్యాలు కలుగ చేయడానికి నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది వస్తున్నది, ఎలా వస్తున్నది ముందుగానే సమాచారం ఇ వ్వాలని, ఆ మేరకు దీక్షాస్థలి వద్ద ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు.
 
 పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు, బీసీ విభా గం రాష్ట్ర కార్యదర్శి బొద్దాని శ్రీని వాస్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డాక్టర్ దిరిశాల వరప్రసాద్, ఏలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు గుడిదేశి శ్రీనివాస్, పటగర్ల రామ్మోహనరావు, గంపల బ్ర హ్మావతి, మంచెం మైబాబు, పార్టీ కార్పొరేటర్లు బండారు కిరణ్‌కుమార్, కర్రి శ్రీ ను, వేడి చిన్నిప్రసాద్, ఇలియాస్ పాషా, జె.రమేష్, ఎన్.సుధీర్ బాబు, శిరిపల్లి ప్ర సాద్, దెందులూరు నియోజకవర్గ నాయకులు ఘంటా ప్రసాదరావు, సంపంగి తిలక్, కొట్టు రాంబాబు, మెట్టపల్లి సూరిబాబు, వేద కుమారి, యలమర్తి జయరాజు, కె.సూర్యనారాయణ, అప్పన ప్రసాద్, చల్లగోళ్ల తేజ, జీహెచ్‌కే ప్రసాద్ (మున్ని) పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement