ఆస్పత్రి సమస్యలు పరిష్కరించకుంటే.. ఆమరణ దీక్ష: ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ దీక్ష చేయడానికైనా వెనుకాడేది లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఆస్పత్రి పరిరక్షణ కమిటీ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉందని, ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారన్నారు.
ల్యాబ్ సౌకర్యం ఉన్నప్పటి కీ టెక్నీషియన్లు లేరని, ఈసీజీ, అల్ట్రా సౌండ్ మిషన్లు ఉన్నా రేడియాలజిస్టు లేరన్నారు. ఇంతటి పెద్ద భవనాలకు ఫ్యాన్లు, విద్యుత్ ఉంది కానీ కొంచం రిపేరు వచ్చినా సరి చేసే ఎలక్ట్రిషియన్ లేడన్నారు. ఆస్పత్రితోపాటు మంచినీటి సౌకర్యం కోసం తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అయినా వీటి అభివృద్ధి కోసం నడుస్తామన్నారు. ఒక వేళ ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే తెలుగుదేశం పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడానికి ఆటంకమైతే.. నియోజకవర్గ ప్రజల కోసం తన శాసనసభ సభ్యత్వాన్ని అయినా వదులుకోవడానికి సిద్ధమని అన్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాలి
డీసీహెచ్‌ఎస్ రామేశ్వరుడు ధర్నా ప్రాంతానికి వచ్చారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే రాచమల్లు డీసీహెచ్‌ఎస్‌ను ప్రశ్నిం చారు. ఉన్న ఫళంగా ఉద్యోగులందరిని తొలగిస్తే అత్యవసర పనులు ఎలా జరుగుతాయని అడిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిని తొలగించామని డీసీహెచ్‌ఎస్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇంకా కింది స్థాయి సిబ్బంది అవసరం ఉందని, అలాగే డాక్టర్లు కూడా కావాలని ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు ప్రజా సంఘాల నాయకులు డీసీహెచ్‌ఎస్‌కు వినతి పత్రం అందించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి, ఆర్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ భాస్కర్, జిల్లా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ కన్వీనర్ అన్వేష్, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, కృష్ణ, తవ్వా సురేష్‌రెడ్డి, కరుమూరి వెంకటరమణ, యల్లయ్య, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అనసూయ, మురళీధర్‌రెడ్డి, టప్పా గైబుసాహెబ్, శంకర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, నాయకులు పోసా భాస్కర్, పాలగిరి ఖాజా, చిప్పగిరి ప్రసాద్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.