'బాలికకు ఆరు పెళ్లిళ్లు'
చిన్నారుల రక్షణ కోసం చేస్తున్న చట్టాలు చట్టుబండలవుతున్నాయి... డబ్బుల కోసం కక్కుర్తిపడి కొందరు నీచులు ముక్కుపచ్చలారని బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు... ధనదాహంతో తండ్రి, సవతి తల్లి బాలికకు కాంట్రాక్ట్ పద్ధతిపై అరబ్‌షేక్‌లతో ఆరు వివాహాలు జరిపించిన ఘటన బుధవారం వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెయిన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాలిక (17)ను తండ్రి అక్బర్, సవతి తల్లి నిలోఫర్, మేనత్త మెహర్‌లు డబ్బుల కోసం అరబ్ షేక్‌లకు ఇచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.
దళారీ రహానా బేగాన్ని సంప్రదించి 2012లో నాగపూర్‌కు చెందిన బషీర్‌తో రూ.30 వేలు తీసుకొని కాంట్రాక్టు పద్ధతిని వివాహం జరిపించారు. తర్వాత రూ.40 వేలు తీసుకొని పూణెలో జమాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. ముంబైలో ఇదే విధంగా మరో రెండు వివాహాలు జరిపించారు. ఫిబ్రవరి 2013లో మరో పెళ్లి జరిపించారు. ఈనెల 14న సూడాన్‌కు చెందిన షేక్ మన్నాన్(50) నుంచి రూ. లక్ష తీసుకొని అతనితో పెళ్లి జరిపించారు. ఈనెల 15న సదరు షేక్ బాలికను నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్తుండగా...బాలిక తప్పించుకుంది.
విషయాన్ని కంచన్‌బాగ్‌లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు తెలిపి, వారి సహకారంతో పీయూసీఎల్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయ వింధ్యాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జయ వింధ్యాల బాలికతో కలిసి బుధవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కాగా ఘటన జరిగిన స్థలం తమ పరిధిలో కాదని రెయిన్‌బజర్ పోలీసులు మొదట మొండికే శారు. అయితే, విషయం డీసీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును కంచన్‌బాగ్‌కు బదిలీ చేస్తామని రెయిన్‌బజార్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలో పేదరికం, నిరక్ష్యరాస్యత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జయ వింధ్యాల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను డిమాండ్ చేశారు.