
సాక్షి, అమరావతి బ్యూరో: విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలుగకుండా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. కరోనా (కోవిడ్–19) ప్రభావంతో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని వినియోగదారులు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకూ చెల్లిస్తే సరిపోతుందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఒకవేళ విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు చేస్తామని వివరించారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్‌కు సంబంధించిన సమస్యలుంటే 1912 నెంబరు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటిలోనే ఉంటూ సహకరిస్తున్న విద్యుత్ వినియోగదారులకు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఇదే సహకారాన్ని అందించాలని, ప్రజలందరికి ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.