రాజాం,న్యూస్‌లైన్: పేదవిద్యార్థులకు చేయూత అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం నిధులను కొందరు అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏళ్ల తరబడి ఈ దందా సాగుతున్నట్టు ‘న్యూస్‌లైన్’ పరిశీల నలో వెల్లడైంది. తమకు రావల్సిన ఫీజు రీయిం బర్స్‌మెంట్ సొమ్ము కోసం పూర్వ విద్యార్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం ఉండ టం లేదు. 2008-09 సంవత్సరం నుంచి విద్యార్థులకు మంజూరైన నిధుల్లో చాలావరకు పక్కదారి పట్టాయని, కొంతమందికే సొమ్ము చెల్లించి మిగిలిన నిధులను అప్పటి సిబ్బంది స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇప్పటికీ కళాశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీరిలో కొంద రు గురువారం కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. వీరితోపాటు ప్రస్తుత విద్యార్థుల కు కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందలేదు.
రీయింబర్స్‌మెంట్ ఇలా..
ఫస్టియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.524, సైన్స్ విద్యార్థులకు రూ.434, ఆర్ట్స్ విద్యార్థులకు రూ.288 చొప్పున.. సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.590, సైన్స్ విద్యార్థులకు రూ.490, ఆర్ట్స్ విద్యార్థులకు రూ.330 చొప్పున చెల్లించాలి. ఈ మేరకు రెండేళ్లకు కలిపి దాదాపు 1200 మందికి సుమారు 5 లక్షల రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ప్రిన్సిపాల్ ఓడీ ఖాతాకు జమ చేసింది. అయినా విద్యార్థులకు ఇంతవరకు చెల్లించలేదు. దీనిపై ప్రశ్నిస్తే కుంటిసాకులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నెలాఖరులోగా చెల్లిస్తాం..
ఈ విషయమై ప్రిన్సిపాల్ పి.నర్సింహమూర్తిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, 2012-13, 2013-14 విద్యా సంవత్సరాల ఫీజు రీయింబ ర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యాయ ని, వీటిని ఈ నెలాఖరులోగా విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సిబ్బంది కొరత, సమైక్యాంధ్ర ఉద్యమ సెలవు ల కారణంగా సకాలంలో చెల్లించలేకపోయామని తెలిపారు. గతంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి తనకు తెలియదని, పరిశీలించి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
కాళ్లరిగేలా తిరుగుతున్నా..
ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్ సెకండియర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము అందలేదు. కళాశాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రిన్సిపాల్‌ను అడిగితే కొత్తగా వచ్చానని, పాత వ్యవహారం తెలియదని చెబుతున్నారు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
-లుకలాపు ప్రసాదరావు, పూర్వ విద్యార్థి
మరో రెండు నెలలు పడుతుందిట..
ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము కోసం కళాశాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. ప్రిన్సిపాల్‌ను అడిగితే పాత రికార్డులను పరిశీలించడానికి రెండు నెలలు పడుతుంది.. తర్వాత చెబుతామంటున్నారు.
-కొండక సురేష్, పూర్వ విద్యార్థి
ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము స్వాహా!
Published Fri, Dec 20 2013 7:01 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement