వణుకుతున్న చిన వంతరాం | Fever Attack In Vizianagaram | Sakshi
Sakshi News home page

వణుకుతున్న చిన వంతరాం

Published Mon, Sep 3 2018 1:21 PM | Last Updated on Mon, Sep 3 2018 1:21 PM

Fever Attack In Vizianagaram - Sakshi

ఒకే ఇంటిలో మంచం పట్టిన చిన్నారులు

విజయనగరం, బలిజిపేట: మండలంలోని చినవంతరం జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  సుమారు ఇరవై రోజులుగా గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పైసా, పరకో ఇచ్చి ఆర్‌ఎంపీ వైద్యుడిచే ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు.విషయం వైద్యాధికారులకు తెలిసినప్పటికీ గ్రామాన్ని సందర్శించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న అతికొద్ది మంది మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటుఆన్నరు. ఒకే ఇంటిలో చిన్నారులు శ్రీలత, భార్గవి జ్వరాలతో మంచంపట్టారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన తల్లి లత, చిన్నారి రోహిత్‌కుమార్‌.. మరో ఇంటిలో సాయి, సింహాచలమమ్మలు.. ఇంకో ఇంటిలో భార్యాభర్తలు సింహాద్రినాయుడు, సింహాచలమమ్మ జ్వరాలతో బాధపడుతున్నారు.

అలాగే గ్రామానికి చెందిన కృష్ణ, బి.సింహాచలం, పి.సింహాచలం, జి.దాలినాయుడు, సీహెచ్‌ చిన్నంనాయుడు, పి.తిరుపతమ్మ, ఎన్‌.సింహాచలమమ్మ, సీహెచ్‌.బుజ్జి, అప్పలనాయుడు, పి.అప్పలనరసమ్మ, సుధ, ఎం.గౌరమ్మ, ఎం.రాధిక, సింహాచలం, సత్తియ్య, బి.నగేష్, బి.పోలినాయుడు, జి.సత్యవతి, సీహెచ్‌ సత్యంనాయుడు, పి.సత్యనారాయణ, పి.సత్యం, బి.చినబాబు, తదితరులు మంచంపట్టారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో ఉన్న ఒక్క బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. నీటి కలుషితం వల్లే జ్వరాలు ప్రబలి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఏఎన్‌ఎం గ్రామానికి వచ్చినప్పుడు ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోయిందని, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి జ్వరాలు అదుపులోకి వచ్చేంతవరకు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

డెంగీతో విద్యార్థిని మృతి
మెంటాడ: మెంటాడ మండలంలో జ్వర మరణాలు ఆగడంలేదు. ఇప్పటికే ఆండ్ర గ్రామానికి చెందిన కునుకు అప్పలనాయుడు, పిట్టాడ గ్రామానికి చెందిన ఎరగడ సంధ్య, పోరాం గ్రామానికి చెందిన ఎ. వెంకటమణి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మెంటాడ గ్రామానికి చెందిన లగుడు నీలిమ(7) అనే విద్యార్థిని జ్వరంబారిన పడి ఆదివారం మృతి చెందింది. వారం రోజుల కిందట నీలిమకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స అందించారు. మూడు రోజుల కిందట విశాఖపట్నం పెద గంట్యాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికరి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. చిన్నారి తండ్రి స్టీల్‌ప్లాంట్‌ క్యాంటిన్‌లో పనిచేస్తుండడంతో ఈఎస్‌ఐ సదుపాయం ఉంది. దీంతో నీలిమను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు దేవి, సురేష్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి నీలిమ విశాఖపట్నంలో రెండో తరగతి చదువుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement