గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు దొర్లాయి...జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంతో ఉత్సాహంగా మిత్రులతో కలిసి గణేశుడిని సాగనంపేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు విగతజీవులుగా మారగా, మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొత్తగూడెం మండలం గొల్లగూడెంలో నివాసముంటున్న పశువుల రామలింగయ్య (28), వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన పుచ్చ మల్లయ్య(22) వాగుల్లో పడి మృతి చెందారు. ఎర్రుపాలెం మండలకేంద్రానికి చెందిన మల్లెల నారాయణరావు (32) కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని కూడల్లి గ్రామ సమీపంలో కట్లేరులో గల్లంతయ్యాడు. కాగా, ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట వద్ద మున్నేరులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది.
లక్ష్మీదేవిపల్లి/ గుండాల, న్యూస్‌లైన్: కొత్తగూడెం మండలం బంగారుచెలక పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో నివాసముంటున్న పశువుల రామలింగయ్య (28) బుధవారం రాత్రి గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామస్తులతో కలిసి బంగారుచెలక సమీపంలోని కిన్నెరసాని డ్యామ్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం సేవించిన రామలింగయ్య ఇంటికి తిరిగి వస్తూ బంగారుచెలక - గొల్లగూడెం మధ్యనున్న పారేటివాగులో పడి గల్లంతయ్యాడు. రామలింగయ్య బంగారుచెలకకు చెందిన బుడగం శంకర్ అనే రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున పనికి రాకపోవడంతో శంకర్ రామలింగయ్య ఇంటికి వచ్చి ఆరా తీశాడు. బుధవారం రాత్రి నిమజ్జనానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో స్థానికులు పారేటివాగు వెంట వెదుకుతుండగా రామలింగయ్య మృతదేహం కనిపించింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కాగా, రామలింగయ్య స్వగ్రామమైన గుండాల మండలం ఆళ్లపల్లికి మృతదేహాన్ని తరలించారు. మృతుడికి భార్య సమ్మక్క, కూతురు రవళి ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదుకాలేదు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రామన్నపేట(ఖమ్మం రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని రామన్నపేట గ్రామ సమీపంలో మున్నేటిలో గురువారం గుర్తు తెలియని యువకుని మృతదేహం(20) లభ్యమైంది. మున్నేటి ఒడ్డున మృతదేహాన్ని చూసిన స్థానికులు వీఆర్వో వీరభద్రంకు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి నుదుటిపై ‘గణపతి బప్పా మోరియా’ అని రాసిఉన్న కాషాయరంగు రిబ్బన్ ఉండడంతో గణేష్ నిమజ్జనానికి వచ్చి మృతి చెంది ఉంటాడ ని భావిస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆచార్యులు తెలిపారు.
చెరువులోపడి యువకుడి మృతి
వేంసూరు : గణేష్ నిమజ్జనం సందర్భంగా మండలంలోని అమ్మపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పుచ్చ మల్లయ్య(22) తోటి మిత్రులతో కలిసి ఎంతో ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమానికి వెళ్లాడు. గణపయ్యను చెరువులో వేస్తున్న క్రమంలో అందులో పడి మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు బుధవారం అర్ధరాత్రి 2 గంటల వరకు చెరువులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం మళ్లీ వెదుకుతుండగా విగ్రహానికి ఐదడుగుల దూరంలో మృతదేహం లభ్యమైంది. మల్లయ్య భార్య లలిత రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతులు
Published Fri, Sep 20 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement
Advertisement