జెడ్పీ మీట్‌లో రచ్చ..రచ్చ
ఎమ్మెల్యే నారాయణస్వామితో టీడీపీ సభ్యుల వాదన
తిప్పికొట్టిన వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు
పోటాపోటీగా నినాదాలు అరుపులతో అర్ధగంటపాటు స్తంభించిన సమావేశం
ఎమ్మెల్యే శంకర్ జోక్యంతో సర్దుబాటు
చిత్తూరు (టౌన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా మారింది. చిత్తూరు జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఒకదశలో తోపులాటలు కూడా జరిగాయి. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ సభ్యులు, కుదరదంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు సభ్యులు వాదోపవాదాలకు దిగారు. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. చివరకు తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ జోక్యంతో సద్దుమణిగింది. జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 11.55 గంటలకు ప్రారంభమైన రచ్చ 2.30 గంటల వరకు కొనసాగింది. అంతకుముందు హుదూద్ తుపానులో మరణించిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
పథకాల్లో అక్రమాలు: నారాయణస్వామి
అనంతరం జరిగిన సమావేశంలో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్ని మంజూరయ్యాయి? ఎవరెవరికి అందుతున్నాయి? పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్నాయని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన చెరకు కషర్ల విషయానికొస్తే అధికారులు చెప్పేదానికి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదానికి తేడాలున్నాయని ఆరోపించడంతో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. అధికారులు చెప్పాల్సిన సమాధానాన్ని టీడీపీ సభ్యులే చెబుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని విమర్శించారు. గత ప్రభుత్వానికి ( కిరణ్ సర్కారుకు) మీరు, మీ నాయకుడు చంద్రబాబు సహకరించబట్టే అధికారులంతా జైలుకెళ్లాల్సి వచ్చిందంటూ నారాయణస్వామి విమర్శించారు. వెనుక వరుసలో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటుకు వెళ్లి జెడ్పీ మీటింగ్‌లో చంద్రబాబు మాటెందుకు ప్రస్తావిస్తారంటూ వాదనకు దిగారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆర్‌కే. రోజా, అమరనాథరెడ్డి, సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఏకంగా వారి వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కాస్త తోపులాట జరిగింది. ైవైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించడంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వారికి పోటీగా వ్యాఖ్యలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రతి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రోజాతో వాదన
ఇంతలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజాతో టీడీపీకి చెందిన ఓ మహిళా సభ్యురాలు వాదనకు దిగారు. దీంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అసలు విషయం దారి మళ్లించిన టీడీపీ సభ్యులు ఎమ్మెల్యే రోజా క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు. రోజా ఏమాత్రం వెరవకుండా ఎట్టి పరిస్థితుల్లో తాను క్షమాపణ చెప్పేదిలేదదన్నారు. దీంతో టీడీపీ సభ్యులు తమ పార్టీ మహిళా సభ్యులను రెచ్చగొట్టి పోడియం వద్దకు పంపారు. రోజా క్షమాపణ చెప్పేవరకు దిగేదిలేదంటూ నినాదాలు చేశారు. ఈ స్థితిలో జోక్యం చేసుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ సభ్యులు సంయమనం పాటిం చాలని, సజావుగా సభ జరిగేందుకు హుందాగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన విషయాలను వదిలేసి ఇకపై సభ సజావుగా జరిగేందుకు అంతా సహకరించాలని కోరడంతో సభ్యులంతా వారివారి సీట్లలో ఆశీనులయ్యారు