గుడివాడ : నందివాడ మండల దేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గుడివాడ టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన నంది వాడ మండల టీడీపీ కార్యాలయంలో రావి, పిన్నమనేనికి చెందిన ఇరు వర్గాలు బాహా బాహీకి దిగాయి. ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలతో కుమ్ముకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నందివాడ మండల పార్టీ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది.
నందివాడ మండలానికి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రి, గుడివాడ అర్బన్‌బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ అధ్యక్షత వహించారు. సమావేశం మొదలు కాగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. అరుపులతో కార్యాలయం హోరెత్తింది.
కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని..
సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు టీడీపీలో చేరారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల అనంతరం గ్రామాల్లో పిన్నమనేనితో పాటు వచ్చిన కార్యకర్తలకు గతంనుంచి టీడీపీలో కొనసాగుతున్న వారికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే పిన్నమనేని సొంత మండలం నందివాడలో పిన్నమనేని అనుచరులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయన అనుచరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. చేపల చెరువుల అనుమతులు సమయంలో పిన్నమనేనికి అనుకూలంగా ఉండే వారిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని కూడా చెబుతున్నారు.
అలాగే ఇటీవల గ్రామాల్లో పింఛన్ల వెరిఫికేషన్‌కు ప్రతి గ్రామంలో నలుగురు సభ్యులతో కమిటీ వేసి జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు అధికారులకు అందించారు. ఈ జాబితాలో నందివాడ మండలంలోని పిన్నమనేని అను చరులకు కనీసం స్థానం లేకుండా పోయింది. దీంతో నందివాడ మండలంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే ఆవేదనతో పిన్నమనేని వర్గీయులు రగిలిపోతున్నారు.
గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసమేనా?
గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని పోలుకొండకు చెందిన నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పిన్నమనేని వర్గీయులు రామశాస్త్రికి మద్దతు ప్రకటించారు. రామశాస్త్రి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు.
అయితే రామశాస్త్రికి ఇవ్వవద్దని, తమిరిశకు చెందిన కొల్లు వెంకటకృష్ణారావు (పెదబాబు) లేదా నందివాడ మండలం వెంకటరాఘవాపురానికి చెందిన కాకరాల సురేష్‌కు ఇప్పించాలని రావి వర్గంలోని కొంతమంది విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఆరెకపూడి రామశాస్త్రికే మొగ్గు ఉండటంతో మంగళవారం జరిగిన సమావేశంలో రావివర్గంలోని కొంతమంది తమ ప్రతాపాన్ని ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా గత వేసవిలో నందివాడ మండలంలో చేపల చెరువుల తవ్వకాలలో పిన్నమనేని వర్గానికి చెందిన వారు చెరువులు తవ్వుతుంటే వాటిని ఆపించేందుకు రావి వర్గానికి చెందిన నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నందివాడ మండలంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీనికి తోడు ఇటీ వలపింఛన్ల వెరిఫికేషన్ కోసం వేసిన గ్రామ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రానున్న కాలంలో పిన్నమనేని, రావి వర్గీయుల మధ్య వర్గ విభేధాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తమ్ముళ్లే బాహాటంగా చెబుతున్నారు.
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
Published Wed, Oct 1 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement