నెల్లూరు : నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల నుంచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల విషయంలో సోమవారం నాటికి స్పష్టత వచ్చింది. రూరల్ నియోజక వర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల పేరుతో ఆయన నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రూరల్ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఆనం వివేకానందరెడ్డి ఈ సారి నియోజక వర్గం మారుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుత నియోజక వర్గంలో ప్రతి కూల పవనాలు ఎదురుకావచ్చనే ఆందోళనతో ఆయన సిటీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిం చాయి.
ఇదే సమయంలో సిట్టింగ్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీంతో వివేకాకు మార్గం సుగమం అయ్యింది. రూరల్ నియోజక వర్గం నుంచి వివేకా తన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డిని బరిలోకి దించబోతున్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వివేకా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ సారి సర్వేపల్లి నుంచి కాకుండా రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మానసికంగా సిద్ధపడ్డారు.
ఇందులో భాగంగానే ఆయన గత మూడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజక వర్గ పర్యటనలకు వెళుతున్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సోమిరెడ్డి తానీసారి రూరల్ నుంచే పోటీకి దిగబోతున్నానని చెప్పకనే చె ప్పారు. దీంతో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చ ంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీ చేస్తారనేది తేలిపోయింది. ఇక సిటీ విషయానికి వస్తే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు
. ఇక్కడ గతంలో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన మిత్రుడు శ్రీధరకృష్ణారెడ్డితో తలపడనున్నారు. దీంతో ఈ నియోజక వర్గానికి సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది.