మలివిడత పంచాయతీ.. పోరు ప్రశాంతం
Published Sun, Jan 19 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: జిల్లాలో శనివారం జరిగిన మలివిడత పంచాయ తీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. 2013 జూలైలో ఎన్నికలు జరగని రెండు సర్పంచ్, ఏడు వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 87 శాతం ఓట్లు నమోదైన ట్లు పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపును చేపట్టారు. వేపాడ మండ లం గుడివాడ పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికలో ప్రత్యర్థి అభ్యర్థి ఎం.స్వామినాయుడుపై 141 ఓట్ల మెజార్టీతో శిరికి.సూర్యనారాయణ గెలుపొందారు. శిరికి సూర్యనారాయణ 358 ఓట్లు కైవసం చేసుకోగా, స్వామినాయుడుకు 217 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ అభ్యర్థికి జరిగిన ఎన్నికలో ప్రత్యర్థి పి.లచ్చన్నదొరపై 20 ఓట్ల మెజార్టీతో జె.బోడియ్య గెలుపొందారు. ఎన్నికల్లో బోడియ్యకు 481 ఓట్లు రాగా, లచ్చన్నదొరకు 461 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణపత్రాలను అందజేశారని పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ పేర్కొన్నారు.
ఏడు వార్డు స్థానాలకు ముగిసిన ఎన్నికలు
వివిధ పంచాయతీల పరిధిలో గతంలో ఎన్నికలు జరగని వార్డులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. అందులో వేపాడ మండలం గుడివాడ పంచాయతీలోని ఒకటవ వార్డును జె.వెంకయ్యమ్మ, మెరకముడిదాం మండలం కొండలావేరు పంచాయతీ నాల్గవ వార్డును గేదెల లక్ష్మీనారాయణ, జియ్యమ్మవలస మండలం అర్నాడ పంచాయతీలో ఏడవ వార్డును ఊయక.తిరుపతిరావు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా తెర్లాం మండలం డి.గదబవలస పంచాయతీలో ఒకటవ వార్డును ఎస్.చంద్రకళ, బాడంగి పంచాయతీ పరిధిలో ఏడవ వార్డును ఎన్.స్వామినాయుడు, బిళ్లలవలస పంచాయతీలో నాల్గవ వార్డును పత్తిగుళ్ల రమణమ్మ, ఎల్.కోట మండలం చందులూరు పంచాయతీలోని ఐదవ వార్డులో రావాడ.చిన్నంనాయుడు గెలుపొందినట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement