‘రెవెన్యూ’లో రగడ | 'Fights revenyulo | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’లో రగడ

Published Sat, Oct 11 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

‘రెవెన్యూ’లో  రగడ

‘రెవెన్యూ’లో రగడ

  • వివాదాస్పదమైన అసోసియేషన్ భూమి లీజు వ్యవహారం
  •  రూ.25 కోట్ల విలువైన భూమికి రూ.10వేలు అద్దె!
  •  కరపత్రాల ద్వారా ఓ వర్గం ప్రచారం
  • మచిలీపట్నం : వడ్డించేవాడు మనోడైతే.. అన్న చందంగా మారింది బందరులోని జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భూమి లీజు వ్యవహారం. రూ.25 కోట్ల విలువైన భూమిని ఓ వ్యక్తికి  చౌకగా నెలకు రూ.10 వేలకే లీజుకు ఇవ్వడంపై అసోసియేషన్‌లోని రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది.

    ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని తాజాగా ఒక వర్గం కరపత్రాల ద్వారా ప్రచారం చేయటం చర్చనీయాంశమైంది. మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటరులోని సాయిబాబా గుడి వెనుక రీసర్వే నంబరు 371/ఎ3లో ఎకరం భూమిని రెవెన్యూ కల్యాణ మండపం, అసోసియేషన్ భవన నిర్మాణం కోసం 2000 సంవత్సరం, ఆగస్టులో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌కు కేటాయించారు.

    అనంతరం లోతట్టుగా ఉన్న ఈ భూమిని ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.2 లక్షలు ప్రభుత్వ నిధులను కేటాయించి మెరక చేయటంతోపాటు ప్రహరీ నిర్మించారు. ఈ భూమిలోని ఐదు సెంట్ల స్థలాన్ని అప్పటి ఎంపీ బాడిగ రామకృష్ణకు క్యాంపు కార్యాలయం కోసం ఎనిమిది నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. ఈ విస్తీర్ణంలో ఆయన రూ.15 లక్షలతో రెండు భవనాలను నిర్మించారు. ఈ భవనాలకు అద్దె చెల్లించే విషయంపై రెవెన్యూ ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో బాడిగ రామకృష్ణ ఈ భవనాలను ఖాళీ చేశారు. వాటిని రెవెన్యూ ఉద్యోగుల అవసరాలకు వినియోగించుకోవాలని ప్రకటించారు.
     
    20 సంవత్సరాలు లీజుకు..

    ఈ క్రమంలో మిగిలిన 95 సెంట్ల స్థలాన్ని 20 ఏళ్ల కాలపరిమితితో కల్యాణ మండపం నిర్మించి వ్యాపారం చేసుకునేందుకు ఓ వ్యక్తికి 2011, నవంబరు 30వ తేదీన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు లీజుకు ఇచ్చారు. కల్యాణ మండపాన్ని ఏడాదిలోపు నిర్మించాలని, నెలకు అద్దె రూ.10వేలు చెల్లించాలని, నిర్మాణం పూర్తి కాకపోయినా అద్దె చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌కు సంబంధించిన సమావేశాలు జరిగితే కల్యాణ మండపాన్ని లభ్యతను బట్టి ఇవ్వాలని ఒప్పంద సమయంలో పేర్కొన్నారు.

    అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని రెవెన్యూ సర్వీసెస్ ద్వారానే కల్యాణ మండపాన్ని నిర్మించాలని కలెక్టర్‌కు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతంలో ఈ భూమిలో నిర్మించిన రెవెన్యూ అసోసియేషన్ భవనాన్ని కూల్చివేశారు.

    లీజుదారుడు కల్యాణ మండపం నిర్మాణ పనులు చేపట్టారు. పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని అతి తక్కువ లీజుకు ఇవ్వటం వెనుక ఎవరు చక్రం తిప్పారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీహెచ్‌వీ చంద్రశేఖర్ మాత్రం నిబంధనల ప్రకారమే అసోసియేషన్‌కు చెందిన భూమిని లీజుకు ఇచ్చామని తెలిపారు.
     
    ఉద్యోగుల సందేహాలు ఇవి
    రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌కు చెందిన 95 సెంట్ల భూమిని 20 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చి వారికి స్వాధీనం చేస్తే తిరిగి అప్పగిస్తారా.. లీజు ముగిసిన తర్వాత కోర్టుకు వెళ్లి ఇబ్బందులు సృష్టిస్తే పరిస్థితి ఏమిటీ?
     
     జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు విరుద్ధంగా లీజుదారుడు ఇక్కడ తన సొంత డబ్బుతో కల్యాణ మండపం నిర్మిస్తే ఈ ఉత్తర్వులను విస్మరించినట్లు అవుతుంది కాదా..
     
     600 అడుగుల స్థలంలో నాలుగు షాపులు నిర్మించి అద్దెకు ఇస్తే నెలకు కనీసం రూ.20వేలు అద్దెల రూపంలో వస్తాయని, కానీ, 95 సెంట్ల స్థలాన్ని నెలకు రూ.10వేలు చొప్పున అద్దెకు ఇవ్వటం వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement