రేషన్ దుకాణాల్లో అక్రమాలను నివారించేందుకు కొత్త ప్రణాళిక ను చేపట్టామని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ.రమేష్ తెలిపారు.
- రేషన్ దుకాణాల్లో అక్రమాలకు త్వరలో చెక్
- పెలైట్ ప్రాజెక్టు కింద జిల్లా ఎంపిక
- రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ.రమేష్
తిరుచానూరు, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాల్లో అక్రమాలను నివారించేందుకు కొత్త ప్రణాళిక ను చేపట్టామని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ.రమేష్ తెలిపారు. నగదు బదిలీ పథకంపై గురువారం మధ్యాహ్నం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా అధికారులు, ఆయిల్, గ్యాస్ డీలర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారునికి ఖచ్చితంగా నిత్యావసర సరుకులు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వేలిముద్రలు తీసుకున్న తరువాతే నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం పెలైట్ ప్రాజెక్టు కింద జిల్లాను ఎంపికచేశారన్నా రు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వనుందని దీనికోసం అధికారులు వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులకు ఐడీ కార్డు, నెంబరు కేటాయించి జాబితాను పంపించాలని సూచించారు. ఆధార్ నమోదు, అనుసంధానంలో జిల్లా ముందంజలో ఉందన్నారు.
గడచిన 6 నెలల కాలంలో జిల్లాలోని లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ.497 కోట్లు అందించామన్నారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్లు, విద్యార్థుల ఉపకార వేతనాలు, వంట గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలలో లబ్ధిదారులకు ఎటువంటి సేవలందిస్తున్నారు, ఆధార్ అనుసంధానం ఎంతవరకు వచ్చిందని ఆరా తీయడంతో పాటు చేయాల్సిన విధులను ఆయన నిర్ధేశించారు.