విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది.
విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. కూలింగ్ టవర్లో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో ప్రాథమిక సమాచారం ప్రకారం ఒకరు మరణించినట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో పదిమందికి పైగా మృతి చెందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో మరో 36 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. 15 మంది ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది.
గాయపడిన వారిని కేర్, కేజీహెచ్ ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఎన్ఎస్ కళ్యాణి చెందిన అంబులెన్స్ లో బాధితులను తరలించారు. క్షతగాత్రులకు తీవ్ర గాయాలవ్వడంతో ప్రాణాలతో పోరాటం కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన సీడీ-2 బ్లాక్ జరిగింది. ప్రమాద స్థలంలో ఇద్దరు కార్మికులు సృహతప్పి పడిపోయినట్టు సమాచారం. మంటలు దట్టంగా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సుమారు 15 కిలో మీటర్ల మేరకు పొగ వ్యాపించాయి. ప్రమాద కారణంగా హెచ్ పీసీఎల్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దాంతో సహాయ చర్యలకు విఘాతం కలుగకుండా ట్రాఫిక్ ను దారి మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టారు,
రిఫైనరీలో మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఉన్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైరింజన్లను రంగంలోకి దించారు. అయితే, అవి తగ్గడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రమాదంలో 36 మంది గాయపడినందువల్ల, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ పేలడంతో అధికారులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.
ఇదిలా ఉండగా హెచ్ పీఎల్ ప్రమాద వివరాలను చెప్పాలంటూ బాధితుల బంధువులు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. తగిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.