ముందు రుణమాఫీ చేయి బాబు...
ఎన్నిలక నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే రైతుల రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేసి... ఆ తర్వాతే కొత్త రుణాలు రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కొరినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు. రఘువీరారెడ్డి అధ్యక్షతను ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు బుధవారం రాజభవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడారు.
ఎన్నికల అనంతరం తమ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశ్యంతో సీమాంధ్ర రైతులు తమ పేర్లను రెన్యువల్ చేసుకోలేదని... దీంతో బ్యాంకులు రైతులకు తాజాగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడం వల్లే రైతుల్లో ఆందోళన నెలకొందని ఆయన ఆరోపించారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతు రుణాల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. ఎంసెట్లో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని నిరోధించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు రఘువీరారెడ్డి వెల్లడించారు.