తొలివిడత ప్రాదేశిక పోరు | first phase provincial elections | Sakshi
Sakshi News home page

తొలివిడత ప్రాదేశిక పోరు

Published Tue, Apr 8 2014 1:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

first phase provincial elections

సాక్షి, ఒంగోలు: తొలివిడత ప్రాదేశిక పోరు రసవత్తరంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలోని 28 మండలాల్లో ఆదివారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువత, రైతులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోటీపడ్డారు.
 
ఫలితంగా.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కంటే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడం ప్రధానంగా మహిళలు అధికసంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆదరణ అధికంగా ఉండటంతో తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గాలి స్పీడు స్పష్టంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు విశే ్లషిస్తున్నారు. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.ఒకట్రెండు చోట్ల మాత్రం టీడీపీ గట్టి పోటీనివ్వగలిగిందని చెబుతున్నారు.
నియోజకవర్గాలవారీగా నమోదైన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 28 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా సగటు పోలింగ్ శాతం 82.68గా నమోదైంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పల్లెల్లో సింహభాగం ప్రజలు లబ్ధిపొందారు. ప్రధానంగా రైతులు, రైతుకూలీ వర్గాలకు వైఎస్ దన్నుగా నిలిచారు.
 
ఆయన చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయగల సత్తా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి  మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ఇప్పటికే సహకార, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదేరీతిగా తీర్పునిచ్చివుంటారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
అద్దంకిలో అత్యధికం..కొమరోలులో అత్యల్పం..

సార్వత్రిక ఎన్నికలకు ముందుగా వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమతీర్పు ద్వారా పార్టీలపట్ల విశ్వసనీయత తెలిపేందుకు పల్లెజనం ఎదురుచూశారు. ఈమేరకు పోలింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్‌ల్లో గంటల తరబడి నిలబడి మరీ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.అద్దంకిలో అత్యధికంగా 91.96 శాతం పోలింగ్  జరగ్గా, అత్యల్పంగాకొమరోలు మండలంలో 69.31 శాతం నమోదైంది.యద్దనపూడి, బల్లికురవ, పెద్దారవీడు మండలాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ జరిగింది.
 
చీరాల, పర్చూరు, కారంచేడు, చినగంజాం, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, అర్థవీడు తదితర మండలాల్లో మాత్రం 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.ఈ మండలాలన్నింటిలో మహిళా ఓటింగ్ శాతం అధికంగా నమోదైంది. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల సాలిడ్ ఓటుబ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అను కూలంగా మొగ్గు చూపినట్లు టీడీపీ, కాంగ్రెస్ వర్గాలే బహిరంగంగా అంగీకరిస్తున్నాయి.
 
జెడ్పీచైర్మన్ కైవసం ఖాయం..
తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
జెడ్పీ చైర్మన్ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వుకాగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం బీసీ నేతకు కేటాయించి ఆ వర్గ ప్రజలపై తనకు వున్న ప్రేమను చాటుకుంది.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల అజెండాపై రైతు, మహిళా వర్గాల్లో ఆశాభావం పెరిగింది.మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మనుగడ పూర్తిగా అంధకారంగా మారడం,పలు మండలాల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం లోపించడంతో మేజర్ ఓటుబ్యాంకు సామాజిక వర్గాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
ఇదే ప్రభావం మలివిడత ప్రాదేశిక పోరులోనూ ఉంటుందని కచ్చితంగా జెడ్పీ చైర్మన్ పదవిని తమపార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవర్గాల్లో కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement