
సోనియమ్మ సీఎం పదవిస్తే.. కాదంటానా?: సర్వే
సాక్షి, హైదరాబాద్: ‘మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నాకే ఇస్తానంటే వద్దనే ధైర్యంనాకు లేదు’ అని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. అయితే సీఎం పదవికి జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి సమర్ధులు అనేకమంది ఉన్నారని చెప్పారు. సీఎం పదవి కోరుకుంటే వచ్చేది కాదని, పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు అంగీకరిస్తేనే వస్తుందన్నారు.
దళితవర్గానికి చెందిన సీమాం ధ్ర వ్యక్తి సంజీవయ్యకు రెండేళ్లు మాత్రమే సీఎం పదవి దక్కిందని, తెలంగాణకు చెందిన దళితులకు అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం పదవి దళితులకు ఇవ్వాలన్న అభిప్రాయం రావడం మంచిదేనన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రూ. లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలన్న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సర్వే తోసిపుచ్చారు. ఇలాంటి ప్యాకేజీలు, బోర్డులు విఫలమయ్యాకే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైందన్నారు.