సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానంతో పాటు మరో పది అనధికార తీర్మానాలు అందాయని శాసనసభలో ప్రకటించిన స్పీకర్ వాటన్నింటినీ సభలో ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. అయితే అధికారిక తీర్మానంతో పాటు మిగిలిన అన్ని తీర్మానాలు ఒకే అంశంపై ఇచ్చినందున అన్నింటినీ చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇలా వచ్చిన తీర్మానాల్లో మొట్టమొదటి తీర్మానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే.
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయమ్మ నేతృత్వంలోని ఎమ్మెల్యేల సంతకాలతో డిసెంబర్ 12 ఉదయం స్పీకర్‌కు నోటీసు అందజేశారు. అసెంబ్లీ రూల్ 77 కింద ఇచ్చిన మొదటి నోటీసు ఇదే. అదే రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి తదితర ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీ తరహాలోనే రూల్ 77 కింద స్పీకర్‌కు నోటీసులు అందించారు. మధ్యాహ్నం తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి అదే మాదిరి నోటీసును స్పీకర్‌కు అందజేశారు. బిల్లు అసమగ్రంగా, తప్పుల తడకగా ఉందని, దీన్ని తిప్పి పంపాలని కోరుతూ విజయమ్మ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న రూల్ 77 కింద స్పీకర్‌కు మరో నోటీసు ఇచ్చారు.
డిసెంబర్ 12న, 16న ఇచ్చిన నోటీసులను గుర్తుచేస్తూ విజయమ్మ జనవరి 24న స్పీకర్‌కు ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. ఆ తర్వాతి రోజు జనవరి 25న చర్చలో పాల్గొన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ రోజు సభ వాయిదా పడిన తర్వాత.. బిల్లును తిప్పిపంపాలంటూ రూల్ 77 కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. అదే రోజున టీడీపీ ఎమ్మెల్యేలు పి.అశోకగజపతిరాజు నేతృత్వంలో రూల్ 77 కింద నోటీసు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఓటింగ్‌కు పట్టుపడితే విమర్శలు చేసిన టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు.. మళ్లీ ఓటింగ్ జరపాలని కోరుతూ జనవరి 26న స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు. బిల్లు అసమగ్రంగా ఉందంటూ లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ కూడా జనవరి 27న రూల్ 77 కింద నోటీసు ఇచ్చారు.